
దట్టమైన అటవీ ప్రాంతం నుంచి కాలినడకన..
రంపచోడవరం: వై.రామవరం పోలీసుస్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టులు పండన్న, రమేష్ మృతదేహాలను గురువారం సాయంత్రం స్థానిక ఏరియా ఆస్పత్రి మార్చురీకి తీసుకువచ్చారు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య శేషరాయి అటవీ ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. సంఘటన స్థలం నుంచి వారి మృతదేహాలను తీసుకురావడానికి పోలీసులకు సుమారు 28 గంటల సమయం పట్టింది. మృతదేహాలను కర్రకు కట్టి దట్టమైన అటవీ ప్రాంతం నుంచి సుమారు 10 కిలోమీటర్ల మేర కాలినడకన మోసుకువచ్చి శేషరాయి చేర్చారు. అక్కడి నుంచి అంబులెన్సులో వై.రామవరం మీదుగా స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు.
నేడు స్వగ్రామానికి పండన్న మృతదేహం..
తీసుకువచ్చేందుకు వెళ్లిన కుటుంబ సభ్యులు
సీలేరు: వై.రామవరం పోలిస్‌స్టేషన్ పరిధి శేషరాయి అటవీ ప్రాంతంలో బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టు కాకూరి పండన్న మృతదేహాన్ని శుక్రవారం స్వగ్రామం కొమ్ములవాడ తీసుకురానున్నారు. ఈ మేరకు అతని తమ్ముడు అప్పన్న, మరదలు వరహాలమ్మ, అల్లుడు వెంకట్రావు, దుప్పులవాడ సర్పంచ్ కుమారి, మరో ఆరుగురు గురువారం ఆస్పత్రికి వెళ్లారు. పోస్టుమార్టం అనంతరం స్వగ్రామం తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను
మోసుకువచ్చిన పోలీసు బలగాలు