
నూరుశాతం ఉద్యోగాలు ఇవ్వాల్సిందే..
సాక్షి, పాడేరు: ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజనులకు నూరుశాతం ఉద్యోగ, ఉపాధ్యాయ పోస్టులను ఇవ్వాల్సిందేనని వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు. పాడేరు ఐటీడీఏ ఎదుట వైఎస్సార్‌సీపీ నేత తెడబారికి సురేష్‌కుమార్ చేపట్టిన ఆమరణ దీక్ష శిబిరాన్ని గురువారం ఆమె సందర్శించారు. గిరిజనులకు నూరుశాతం ఉద్యోగాల జీవో 3 పునరుద్ధరణ, ప్రత్యేక డీఎస్సీ డిమాండ్‌తో సురేష్‌కుమార్ చేపట్టిన దీక్షకు ఆమె సంఘీభావం తెలిపారు. దీక్ష శిబిరంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీలకు ప్రత్యేక డీఎస్సీ ద్వారా 16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాల్సిన కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీతో అన్యాయం చేస్తోందన్నారు. నూరుశాతం ఉద్యోగాలు కల్పించాల్సిన కూటమి ప్రభుత్వం 6 శాతం ఉద్యోగాలకే పరిమితం చేయడం దుర్మార్గమన్నారు. గిరిజనులకు అన్యాయం చేస్తే వైఎస్సార్‌సీపీ ఉపేక్షించదని, గిరిజనుల పక్షాన పోరాడతామని హెచ్చరించారు. పాడేరు వైస్ ఎంపీపీ కుంతూరు కనకాలమ్మ, వైఎస్సార్‌సీపీ నాయకులు లకే రామసత్యవతి, కోడా సుశీల, కొట్టగుళ్లి నాగేంద్ర, పీసా కమిటీ సుండ్రుపుట్టు, గుడివాడ ఉపాధ్యక్షులు డి.పి.రాంబాబు, బోనంగి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్‌రాష్ట్ర అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి