
సాగర గర్భంలో భయో వ్యర్థాలు!
● ప్లాస్టిక్ వేస్ట్‌తో సమానంగా మెడికల్ వ్యర్థాలు లభ్యం ● బయో వేస్ట్ వెలికితీస్తున్న స్కూబా డైవర్లు ● జాలరిపేట, రుషికొండ తీరాల్లో ఎక్కువగా లభ్యం ● జలచరాలకు హానికరమంటున్న పర్యావరణవేత్తలు
సాక్షి, విశాఖపట్నం: సాగర తీరాన్ని బయో వ్యర్థాలు భయపెడుతున్నాయి. ప్రాణాంతకమైన మెడికల్ వేస్ట్‌ను అత్యంత భద్రంగా నిర్వహించాల్సి ఉండగా.. కొన్ని ఆస్పత్రులు సముద్రాన్నే డస్ట్‌బిన్‌గా మార్చేసుకున్నాయి. దీంతో ప్రమాదకరమైన వైద్య వ్యర్థాలు సముద్రాన్ని ముంచెత్తుతున్నాయి. పర్యావరణ నిపుణుల అంచనా ప్రకారం ఏటా విశాఖ సాగర తీరంలో 350 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు, సుమారు 10 టన్నుల వరకూ మెడికల్ వ్యర్థాలు సముద్రగర్భంలో కలుస్తున్నాయి. సాగర గర్భంలోకి చొచ్చుకుపోతున్న ఈ వ్యర్థాలు.. జీవ వైవిధ్యానికి చేటు తెస్తున్నాయి.. ఫలితంగా జలచరాలు నిర్జీవంగా మారిపోతున్నాయి. ఇటీవల ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించేందుకు స్వచ్ఛందంగా నడుంబిగించిన కొంతమంది స్కూబా డైవర్లు.. సముద్రం నుంచి బయో వ్యర్థాలు బయటపడుతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మెడీవేస్ట్ ‘సీ’గా మార్చేస్తున్నారు
అందాల సముద్ర తీరాన్ని ఆస్వాదించేందుకు వస్తున్న పర్యాటకులకు మెడీ వేస్ట్ దర్శనమిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఇలా బయో వ్యర్థాలను సముద్రంలో పారబోస్తున్నారు. ఈ వ్యర్థాలను నిర్వహణ సంస్థలకు ఇవ్వాలంటే కొంత డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే బీచ్‌కు సమీపంలోని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు ఈ తరహా ఇంజిక్షన్లు, సిరంజీలు, కాలం చెల్లిన మందులు, ఇంజక్షన్ సీసాలు, సైలెన్ బాటిల్స్ సాగరంలో కలిపేస్తున్నాయి. కేవలం రూ.1000 నుంచి రూ.2 వేలకు కక్కుర్తి పడుతున్న చిన్న చిన్న ఆస్పత్రుల నిర్వాహకులు.. సముద్రాన్ని మెడీవేస్ట్ సీగా మార్చేస్తూ పర్యావరణానికి హానితలపెడుతున్నారు.