
నెలాఖరు వచ్చినా అందని రేషన్ బియ్యం
పెదబయలు: పేదలకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం, ఇతర నిత్యావసర సరకులు ప్రతి నెల 1 తేదీ నుంచి 17 తేదీలోపు పంపిణీ చేయాలి. అయితే మండలంలోని ఐదు డిపోల పరిధిలో ఇప్పటికీ రేషన్ బియ్యం పంపిణీ చేయకపోవడంతో కార్డుదారులు అవస్థలకు గురవుతున్నారు. తమకు వెంటనే బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం తామరవీధి గ్రామ కార్డుదారులు నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని జీసీసీ, సివిల్ సప్లై అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని వాపోయారు. మండల గోదాం నుంచి బొండాపల్లి, పోయిపల్లి, బొంగరం, పెదబయలు, బొంగరం డీఆర్ డిపోలకు ఏప్రిల్ నెలకు సంబంధించిన రేషన్ బియ్యం పూర్తి స్థాయిలో సరఫరాకాలేదు. బొండాపల్లి డిపోలో 590 కార్డులకు గాను 11,150 కిలోల బియ్యం పంపిణీ చేయవలసి ఉండగా 6,800 కిలోల బియ్యం వచ్చాయి. మార్చిలో నిల్వ 615 కిలోలు ఉండగా వచ్చిన బియ్యం,నిల్వ పోగా 3,735 కిలోల బియ్యం రావాల్సి ఉంది. అలాగే పోయిపల్లి 240 కార్డులకుగాను 4,605 కిలోలు రావాల్సి ఉండగా 2,550 కిలోలు వచ్చాయి. బొంగరం డిపోలో 334 కార్డులకు 6,100 కిలోల బియ్యం రావాల్సి ఉండగా 5,100 కిలోలు వచ్చాయి. ఇంకా 1000 కిలోలు రావాల్సి ఉంది. సీకరి డిపోలో 586 కార్డులకు 12,040 కిలోల బియ్యం రావాల్సి ఉండగా 11,100 కిలోలు వచ్చాయి. 940 కిలోల బియ్యం రావాల్సి ఉంది. మండలం కేంద్రం పెదబయలులో 845 కార్డులకు 14,295 కిలోల రావాల్సి ఉండగా 13,300 కిలోలు వచ్చాయి. 995 కిలోల బియ్యం రావాల్సి ఉంది. దీంతో బొండాపల్లి డిపో పరిధిలో తామరవీధి, ఎగువ బొండాపల్లి, తాడేవీధి, కుయిభ గ్రామాలకు, పోయిపల్లి డిపో పరిధిలో అర్లాబు, సైలంకోట, గడ్డిజిలుగులు గ్రామాలతోపాటు మిగిలిన మూడు డిపోల పరిధి లోని గ్రామాల కార్డుదారులకు ఏప్రిల్ నెల బియ్యం అందలేదు. రేషన్ బియ్యం అందక అవస్థలు పడుతున్నామని కార్డుదారులు వాపోయారు. ఈ విషయంపై పెదబయలు జీసీసీ బ్రాంచ్ మేనేజర్ ఒలేసి గాసీని వివరణ కోరగా మండలంలో 10 డిపోలకు పూర్తి స్థాయిలో స్టాక్ రాలేదన్న విషయం తన దృష్టికి వచ్చిందని, తహసీల్దార్‌కు నివేదించానని చెప్పారు. ఈ నెల 16,17 తేదీల్లో ఐదు డిపోలకు స్టాక్ వచ్చిందని మరో ఐదు డిపోలకు ఇంకా రావాల్సి ఉందన్నారు.
జీసీసీ,సివిల్ సప్లై అధికారులకు
తెలిపినా స్పందన శూన్యం
నిరసన వ్యక్తం చేసిన కార్డుదారులు