
పెదబొడ్డేపల్లిలో మూడు చోరీలు
నర్సీపట్నం : నర్సీపట్నం మున్సిపాలిటీ 11వ వార్డు పెదబొడ్డేపల్లి థెరిస్సా కాలనీలోనే మంగళవారం రాత్రి ఈ మూడు చోరీలు జరగడం విశేషం. ఎం.సత్యసారథి తన తండ్రికి ఆరోగ్యం బాగోకపోవడంతో ఈ నెల 13న విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రి తీసుకువెళ్లాడు ఇంటి వద్ద ఎవరూ లేరని గమనించిన దొంగలు ఇంట్లో ప్రవేశించి ఏడు తులాల బంగారు ఆభరణాలు, రూ.2 వేలు నగదు పట్టుకుపోయారు. ఇంటి తలుపులు తీసి ఉండడంతో ఇంట్లో అద్దెకు ఉంటున్నవారు సారధికి సమాచారం అందించడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడకు కూతవేటు దూరంలోని బత్తిన రామకృష్ణ ఇంట్లో కూడా దొంగతనం చోటుచేసుకుంది. రామకృష్ణ పూడిమడక వద్ద నిర్మితమవుతున్న పోర్టులో విధులకు వెళ్లగా, అతని భార్య భవాని పాపను తీసుకుని అమ్మ గారు ఊరులో జరుగుతున్న పండగకు వెళ్లింది. దీంతో ఆ ఇంట్లో దొంగలు ప్రవేశించి రెండు తులాలు బంగారు అభరణాలు, 25 తులాలు వెండి అభరణాలు అపహరించారు. తలుపులు తీసి ఉండడంతో ఎదురింటి వారు సమాచారం ఇవ్వడంతో భవాని హుటాహుటిన ఇంటికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే ఇక్కడకు మరికొంత దూరంలో ఉన్న విశాఖ ఎయిర్‌పోర్టులో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న అడిగర్ల శ్రీరామమ్మూర్తి ఇంట్లో కూడా దొంగలు చోరీకి పాల్పడ్డారు. విధి నిర్వహణలో భాగంగా శ్రీరామమ్మూర్తి భార్యతో విశాఖలో ఉంటున్నారు. ఇంటికి సీసీ కెమెరాలు పెట్టి సెల్‌కు వైపై కనెక్షన్ ఇచ్చారు. రాత్రి దొంగలు ఇంట్లోకి ప్రవేశించడం వైఫైలో హైదరాబాద్‌లో ఉంటున్న కుమారుడు శ్రీరామమ్మూర్తికి సమాచారం అందించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఇంట్లోని ఆరు తులాలు వెండి అభరణాలు చోరీ అయ్యాయి. ఒకే ఏరియాలో ప్లాన్ ప్రకారం దొంగలు చోరీకి పాల్పడి పోలీసులకు సవాల్ విసిరారు. ఫిర్యాదులు అందుకున్న పట్టణ సీఐ గోవిందరావు, క్లూస్ టీమ్ సిబ్బందితో ఆనవాళ్లు సేకరించారు. వరుస దొంగతనాలతో థెరిస్సా కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు.

పెదబొడ్డేపల్లిలో మూడు చోరీలు