బురదలో అదుపు తప్పిన బస్సు
సీలేరు: జీకేవీధి మండలం ధారకొండ గుమ్మిరేవుల రహదారిలో నర్సీపట్నం డిపో బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం మధ్యాహ్నం ధారాలమ్మ ఘాట్ రోడ్డులో రెండు గలటలపాటు భారీ వర్షం కురిసింది. వర్షం నీరు మాదిమళ్లు గెడ్డలో చేరడంతో వంతెన వద్ద ఉధృతంగా ప్రవహించింది. ఆ సమయంలో బురదమయంగా తయారైన మాదిమళ్ల వంతెన అప్రోచ్ రోడ్డును సర్సీపట్నం– గుమ్మిరేవుల బస్సు ఎక్కుతుండగా అదుపు తప్పి బురదలో వెనక్కి జారిపోయింది. బస్సును ఆపడానికి డ్రైవర్ ఎంత ప్రయత్నించినా, బ్రేకులు వేసినా ఫలితం లేకపోయింది. అప్రోచ్ రోడ్డు కింద భాగంలో తూరలు వద్ద గండి పండిన ప్రాంతంలో బస్సు ఆగింది.ఆ సమయంలో బస్సులో 10 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. గత ఏడాది సెప్టెంబర్ 8న కురిసిన భారీ వర్షాలకు మాదిగమళ్లు వంతెన అప్రోచ్‌రోడ్డు కొట్టుకుపోయింది. అధికారులు నామమాత్రంగా మట్టి పోసి మిన్నకుండిపోవడంతో ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మాదిమళ్ల వంతెన అప్రోచ్ రోడ్డు వద్ద
తప్పిన ప్రమాదం


