చెత్త సేకరణ.. అంతా అధ్వానం! | - | Sakshi
Sakshi News home page

చెత్త సేకరణ.. అంతా అధ్వానం!

Sep 18 2026 2:09 AM | Updated on Sep 18 2026 2:09 AM

తడి, పొడి వేరుచేయడం శూన్యం

అటకెక్కిన బయోమైనింగ్‌.. పత్తాలేని కంపోస్ట్‌ తయారీ

గుట్టలుగా చెత్త నిల్వలు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు

‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్ట్‌లో తేటతెల్లం

కై లాస్‌నగర్‌: పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ పరిస్థితి. గ్రేడ్‌–1 మున్సిపల్‌ అయినప్పటికీ చెత్త నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. తడి, పొడి చెత్తను వేరుగా సేకరించాలనే నిబంధన కాగితాలకే పరిమితమైంది. పారిశుద్ధ్య వాహనాలు సరైన సమయానికి రాకపోవడంతో ప్రజలు చెత్తను రోడ్లపైనే పారబోస్తున్నారు. బుట్టలు పంపిణీ చేసినా అవగాహన లోపంతో కలిపే ఇస్తున్నారు. సిబ్బంది కూడా అలాగే డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. గురువారం ‘సాక్షి’ పరిశీలనలో అధికారుల నిర్లక్ష్యం బట్టబయలైంది.

మూతపడిన డీఆర్‌సీసీ సెంటర్‌ ...

పట్టణంలోని 49వార్డుల నుంచి నిత్యం దాదాపు 64మెట్రిక్‌ టన్నుల చెత్త 4వ వార్డు బంగారుగూడలోని 36ఎకరాల డంపింగ్‌యార్డుకు చేరుతోంది. చెత్త సేకరిస్తున్నప్పటికి కాలనీల్లో ఎక్కడపడితే అక్కడ చెత్త కుప్పలు దర్శనమిస్తుండటం సేకరణలో జరుగుతున్న నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. గత కొన్ని నెలలుగా బయోమైనింగ్‌ ప్రక్రియ నిలిచిపోవడంతో డంపింగ్‌యార్డులో చెత్త కుప్పలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. దీంతో దుర్వాసన వెదజల్లుతోంది. చెత్తలోని గాజు, ప్లాస్టిక్‌, అట్టలు వంటి 14రకాల వ్యర్థాలను వేరుచేసేందుకు రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన రడ్రై రిసోర్సు కలెక్షన్‌ సెంటర్‌ (డీఆర్‌సీసీ) ప్రస్తుతం మూతపడింది. కొనుగోలు చేసిన యంత్రాలు నిరుపయోగంగా మారి తుప్పుపడుతున్నాయి.

నిర్మాణానికే పరిమితమైన వర్మీకంపోస్ట్‌ యూనిట్‌..

తడి, పొడి చెత్తను వేరు చేయడంతో పాటు వర్మీ కంపోస్టు ఎరువు తయారు చేయాలనే ఉద్దేశంతో డంపింగ్‌యార్డులో ప్రత్యేక కేంద్రాన్ని ఆరేళ్ల కిందట నిర్మించారు. ఎరువుల తయారీకి వీలుగా బెడ్‌లను సిద్ధం చేయడంతో పాటు పలువురు కార్మికులను ప్రత్యేకంగా నియమించారు. అయితే ఎరువుల తయారీ మాత్రం జరగడం లేదు. ఈ యూనిట్‌ కేవలం నిర్మాణానికే పరిమితమైంది.

నిలిచిన బయో మైనింగ్‌..

గత మూడేళ్ల క్రితం వరకు పోగైన 1.16లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్త బయోమైనింగ్‌ బాధ్యతలను హైదరాబాద్‌కు చెందిన ఓ కంపెనీ నిర్వహించింది. ఇందుకోసం ఆ సంస్థకు రూ.1.16కోట్ల నిధులు అందజేశారు. గత రెండేళ్ల నుంచి చెత్తను ఎరువుగా మారుస్తున్న ఈ కంపెనీ గడువు ముగియడంతో బయోమైనింగ్‌ నిలిచిపోయింది. గతేడాది కాలంగా ఈ ప్రక్రియ జరగడం లేదు. దీంతో చెత్త నిల్వలు గుట్టలుగా పేరుకుపోయాయి. చెత్తకుప్పలకు కార్మికులు నిప్పు అంటిస్తుండటంతో ఆయా ప్రాంతాల్లోని కాలనీవాసులు, పంట చేలల్లోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఎక్కడపడితే అక్కడ చెత్త కుప్పలు..

పట్టణంలోని వార్డుల్లో రోజు విడిచి రోజు ట్రాలీ ఆటోలు, ట్రాక్టర్ల ద్వారా చెత్త సేకరణ చేపడుతున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ ఈ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదు. పలు వార్డుల్లో సమయానికి వాహనాలు రావడం లేదు. దీంతో కాలనీవాసులు చెత్తను రోడ్లపై పడేస్తున్నారు. బల్దియా కార్మికులు ఆ చెత్తను వారం, పదిహేను రోజులకు తరలిస్తుండడంతో రోజుల తరబడి నిల్వ ఉండటంతో ఆయా ప్రాంతాల్లో కంపు వాసన వెదజల్లుతోంది.

ఆదిలాబాద్‌ పట్టణంలోని వార్డులు 49

కుటుంబాలు 48,393

ప్రతి రోజు పోగయ్యే చెత్త 64మెట్రిక్‌ టన్నులు

రోజువారీగా పోగయ్యే తడి చెత్త 22మెట్రిక్‌ టన్నులు

పొడి చెత్త 42మెట్రిక్‌ టన్నులు

చెత్తను తరలించే వాహనాలు 25ట్రాక్టర్లు, 48ట్రాలీ ఆటోలు

రోజువారీగా వినియోగమయ్యే ఇంధన వ్యయం రూ.8లక్షలు

పారిశుద్ధ్య కార్మికులు 278మంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement