కై లాస్‌నగర్: జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ మందకొడిగా సాగుతుంది. సాంకేతిక సమస్యలతో రెండు రోజులుగా సర్వర్ పనిచేయడం లేదు. దీంతో ఫీజు చెల్లించేందుకు వచ్చే దరఖాస్తుదారులకు నిరాశ ఎదురవుతుంది. జిల్లాలోని ఏకై క ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో ఇప్పటికే ఈ ప్రక్రియ ఆశించిన స్థాయిలో జరగడం లేదనే విమర్శలున్నాయి. తాజా గా సాంకేతిక సమస్యలు తోడవడం గమనార్హం.
ఇదీ పరిస్థితి..
2020లో ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం విడతల వారీగా ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో ఈ ప్రక్రియను నిర్వహించింది. మరోసారి మార్కెట్ ఫీజులో 25శాతం రాయితీ వర్తింపజేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 1నుంచి 31వరకు గడువు విధించింది. అయితే దీనిపై అధికారులు సరైన ప్రచారం చేపట్టకపోవడం, దరఖాస్తుదారుల అవగాహన రాహిత్యంతో స్పందన అంతంతే ఉన్నట్లుగా తెలుస్తోంది.
సాంకేతిక సమస్యలతో జాప్యం ..
మూలిగే నక్కపై తాటికాయపడ్డ చందంగా మారింది మున్సిపల్‌లో ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ. మొత్తం 17,865 మంది ఫీజు చెల్లింపునకు అర్హులు కాగా అందులో కేవలం 4,564 మంది మాత్రమే చెల్లించారు. అందులోనూ 1,716 మందికి ఇంకా ప్రొసీడింగ్ జారీ చేయాల్సి ఉంది. తాజాగా ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించడంతో దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలో పురోగతి కనిపిస్తుందని భావించారు. అయితే సర్కారు ఆశించిన స్పందన లేదు. ఇప్పుడిప్పుడే దరఖాస్తుదారులు మున్సిపల్ కార్యాలయానికి వస్తుండగా తాజాగా రెండు రోజులుగా సర్వర్ పనిచేయడం లేదు. 25శాతం ఫీజు రాయితీకి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం మారుస్తున్నందున ఈ సమస్య తలెత్తుతున్నట్లుగా మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం తాజాగా వ్యవసాయ భూములు, ప్లాట్ల మార్కెట్ విలువ పెంచాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన కసరత్తుకు ఆదేశించింది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు భూముల విలువలతో కూడిన వివరాలు నమోదు చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో కచ్చా లేఅవుట్‌లోని పది శాతం ప్లాట్లను విక్రయించుకుని మిగతా ప్లాట్లను రిజిస్ట్రేషన్ కార్యాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ (ఐజీఆర్‌ఎస్) చేసుకోవాలనుకునే వారు ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుకు ముందుకు వస్తుండగా సాంకేతిక సమస్యలు అడ్డంకిగా మారుతున్నాయి. కాగా, భూములు, ప్లాట్ల మార్కెట్ విలువ పెంచుతున్న నేపథ్యంలో సర్వర్ సమస్య ఏర్పడుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సోమవారం దీనిపై స్పష్టత వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.


