కైలాస్‌నగర్: విద్యార్థుల హాజరుశాతం పెరిగినప్పుడే మెరుగైన ఫలితాలు వచ్చేందుకు ఆస్కారముంటుందని ఆ దిశగా ఉపాధ్యాయులు దృష్టి సారించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజాపాలన– ప్రగతిప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11నుంచి నిర్వహించిన విద్యా వారోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘విద్యా విజయోత్సవం’ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదనపు కలెక్టర్, ఇన్‌చార్జి డీఈవో రాజేశ్వర్‌తో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రతీ విద్యాసంస్థలో పేరెంట్స్, టీచర్స్ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. బడిబాట కార్యక్రమంతో విద్యార్థుల ప్రవేశాలు పెరుగుతున్నప్పటికీ హాజరుశాతం తగ్గుతోందని, తద్వారా డ్రాపౌట్స్ చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ఈ మేరకు ఉపాధ్యాయులు దృష్టి సారించాలన్నారు. ఫలితాలు మెరుగుపడాలంటే 75శాతం హాజరు నమోదయ్యేలా చూడాలన్నారు. రానున్న నూతన విద్యాసంవత్సరంలో పాఠశాలల్లో సీఎం బ్రేక్‌పాస్ట్, జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయనున్నట్లుగా తెలిపారు. కార్యక్రమంలో డీఐఈవో జాదవ్ గణేశ్ కుమార్, ఏఎంవోలు లక్ష్మణ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
టాపర్స్, అధ్యాపకులు, టీచర్స్‌కు సన్మానం
విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేస్తున్న పలువురు అధ్యాపకులు, ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించారు. వీరితో పాటు పది, ఇంటర్మీడియెట్‌లో టాపర్స్‌గా నిలిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేసి అభినందించారు. అనంతరం ఆదిలాబాద్ బాల కేంద్రం పుస్తక నిధి ప్రచార పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి.


