కై లాస్‌నగర్: జిల్లా కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపు ప్రక్రియకు ఎట్టకేలకు మోక్షం లభించింది. లబ్ధిదారుల ఎంపిక చేపట్టేందుకు గాను యంత్రాంగం సిద్ధమైంది. శనివారం సాయంత్రం 4గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పాయల్ శంకర్ సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించనున్నారు. అయితే మ్యానువల్‌గా కాకుండా ఆన్‌లైన్‌లో ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లుగా తెలిసింది.
ఇదీ పరిస్థితి ..
నిరుపేదలకు సొంతింటి కల సాకారం చేయాలనే ఉద్దేశంతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పట్టణంలోని కేఆర్‌కే కాలనీలో రెండు బ్లాక్‌లుగా 760 ఇళ్లను నిర్మించగా, మావలలోని సర్వేనంబర్ 170లో 222 ఇళ్ల చొప్పున మొత్తం 982 ఇళ్లను నిర్మించారు. ఇందులో 720 ఇళ్ల కేటాయింపున కోసం మూడేళ్ల క్రితం అప్పటి కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్‌యార్డులో లక్కీడ్రా నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే క్షేత్రస్థాయిలో నాటి లబ్ధిదారుల స్థితిగతులపై విచారణ చేపట్టిన మున్సిపల్ అధికారులు అందులో 527 మంది మాత్రమే అర్హులుగా ఉన్నట్లుగా తేల్చారు.
నేడు లక్కీడ్రా..
సర్వేనంబర్ 170లో ఉన్న 222 ఇళ్లకు గాను 48 ఇళ్లను భవిష్యత్ అవసరాల కోసం రిజర్వ్‌లో ఉంచనున్నారు. మిగిలిన 174 ఇళ్లు, అలాగే కేఆర్‌కే కాలనీలోని గతంలో లక్కీడ్రాలో మిగిలినవి కలిపి మొత్తం 337 ఇళ్లకు కలెక్టర్ ఆధ్వర్యంలో కౌన్సిలర్ల సమక్షంలో నేడు లక్కీడ్రా నిర్వహించనున్నారు. అయితే గతంలో దరఖాస్తుదారుల సమక్షంలో డ్రా నిర్వహించగా ప్రస్తుతం మాత్రం మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారుల సమక్షంలోనే ఈ ప్రక్రియ చేపడుతున్నారు. ఇది కూడా ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల అన్ని పార్టీల కౌన్సిలర్లు తమ వార్డుల పరిఽఽధిలో నుంచి కొంతమంది పేర్లతో కూడిన జాబితా సిద్ధం చేసి అధికారులకు అందజేశారు. బీజేపీ కౌన్సిలర్లు ఒక్కొక్కరు పది నుంచి 15 మంది పేర్లు ఇవ్వగా, కాంగ్రెస్ కౌన్సిలర్లు 6నుంచి 8 మంది, ఎంఐఎం, బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు ముగ్గురేసి పేర్లతో కూడిన జాబితాలను అందజేశారు. వారిచ్చిన జాబితా ప్రకారమే లక్కీ డ్రా నిర్వహిస్తారా లేక దరఖాస్తుదారులందరి వివరాలతో కూడిన జాబితా ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపడుతారా అనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఆన్‌లైన్‌లోనే ఎంపిక ప్రక్రియ
లక్కీ డ్రా ప్రక్రియ ఈ సారి మ్యానువల్‌గా కాకుండా ఆన్‌లైన్‌లో ఉంటుంది. కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా హౌసింగ్, రెవెన్యూ అధికారులు ఈ ప్రక్రియను నిర్వహించనున్నారు. దరఖాస్తులను పలుమార్లు ర్యాండమైజ్‌గా చేసి కౌన్సిలర్లు అంగీకరించిన తర్వాతే లబ్ధిదారుల ఎంపిక చేపట్టడం జరుగుతుంది.
– ఏ.జగదీశ్వర్‌గౌడ్, మున్సిపల్ కమిషనర్
డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమాచారం..
కేటాయించనున్న ఇళ్లు : 337
దరఖాస్తుదారులు : 1100 మంది


