సిరికొండ: విద్యావారోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని కేజీబీవీలో రూ.కోటి 72లక్షలతో చేపట్టిన అదనపు తరగతుల నిర్మాణానికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గురువారం భూమిపూజ చేశారు. ఎస్సెస్సీ టాపర్‌గా నిలిచిన విద్యార్థినితో ఆర్వోఆర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. విద్యార్థినులతో కలిసి అల్పాహారం స్వీకరించారు. పదోతరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినులను శాలువాలతో సన్మానించారు. మండలంలోని రాయిగూడ ఆశ్రమ పాఠశాలలో రూ.13 లక్షలతో నిర్మించిన సైన్స్ ల్యాబ్‌ను ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో ప్రమాదకర విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను గుర్తించిన ఎమ్మెల్యే చుట్టూ రక్షణ గోడ నిర్మించాలని అక్కడే ఉన్న ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ సతీశ్‌ను ఆదేశించారు. ఇన్‌చార్జి ఎంపీడీవో సంతోష్‌కుమార్, సర్పంచులు బొడ్డు దత్తాత్రి, పెందుర్ లక్ష్మణ్, రాజు, ఎంఈవో సునీల్‌కుమార్, ఎస్వో సంధ్యారాణి, ఆత్రం భాస్కర్, నాయకులు రంజాన్, పెంటన్న, ఎక్బాల్, చందు, తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చోడ: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో రూ.13.50లక్షలతో నిర్మించిన అదనపు గదులను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, సర్పంచ్ కొడప జలైజాకు, బీఆర్‌ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి, ప్రధానోపాధ్యాయుడు రమణారెడ్డి తదితరులున్నారు.
నేరడిగొండ: మండల కేంద్రంలోని కేజీబీవీలో రూ.68 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భూమిపూజ చేశారు. విద్యార్థినులకు మెరుగైన వసతులు కల్పించేందుకు నూతన గదుల నిర్మాణం, పాఠశాల భవనానికి మరమ్మతు పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


