వేర్వేరు చోట్ల జొన్న పంట దగ్ధం | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు చోట్ల జొన్న పంట దగ్ధం

May 1 2026 5:33 AM | Updated on May 1 2026 5:33 AM

బోథ్‌: మండల కేంద్రంలోని లాల్‌పిచ్‌ మైదానం సమీపంలో సాగుచేసిన 13 ఎకరాల జొన్నపంట ప్రమాదవశాత్తు దగ్ధమైంది. గురువారం సాయంత్రం పంటచేలలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సింగం వెంకటరమణకు చెందిన ఎనిమిది ఎకరాలు, గోవింద్‌కు చెందిన రెండెకరాలు, మాధవ్‌కు చెందిన మూడెకరాల్లో పంట పూర్తిగా కాలిపోయింది. గమనించిన స్థానికులు ఇచ్చోడలోని ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేశారు. సింగం వెంకటరమణకు రూ.4 లక్షలు, గోవింద్‌కు రూ.1.50 లక్షలు, మాధవ్‌కు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతులు వాపోయారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

మెడిగూడలో (ఆర్‌)లో..

సాత్నాల: మండలంలోని మెడిగూడ (ఆర్‌)లో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో జొన్నపంట దగ్ధమైంది. గ్రామానికి చెందిన చిట్యాల రాములు రెండెకరాల్లో సాగు చేసిన జొన్నపంటను కోసి పంటచేలోనే ఉంచాడు. గురువారం పంటచేల పైనుంచి వెళ్తున్న విద్యుత్‌ తీగలు ఒకదానికి ఒకటి తాకి నిప్పులు ఎగిసి పడడంతో పంటకు నిప్పంటుకుని క్షణాల్లో మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానిక రైతులు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అదుపులోకి రాకపోవడంతో జొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. దాదాపు రూ.1,50,000 నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయాడు. సమాచారం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగిందని గ్రామస్తులు ఆరోపించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్‌ లైన్లను సరిచేయాలని డిమాండ్‌ చేశారు.

కుంటాలలో..

లోకేశ్వరం(కుంటాల): కుంటాల మండలంలోని కల్లూర్‌లో 11 కేవీ విద్యుత్‌ తీగలు గాలికి ఒకదానికి ఒకటి తాకడంతో నిప్పురవ్వలు ఎగిసిపడి గ్రామానికి జొన్నపంట దగ్ధమైంది. బాధిత రైతులు తెలిపిన వివరాల మేరకు అందకూర్‌కు చెందిన వెంకట్‌ వారం రోజుల క్రితం జొన్నచేను కోసి పంటను కల్లూర్‌లోని సాయిరాం చేనులో ఆరబెట్టాడు. పంటచేను పైనుంచి వెళ్లిన 11 కేవీ విద్యుత్‌ తీగలు ఒకదానికి ఒకటి తాకడంతో నిప్పురవ్వలు ఎగిసిపడి మంటలు చెలరేగాయి. జొన్నపంటతో పాటు రైతులు సాయిరాం, బలిరాంకు చెందిన వ్యవసాయ పరికరాలు దగ్ధమయ్యాయి. జొన్న పంట విలువ రూ.20 వేలు, వ్యవసాయ పరికరాల విలువ రూ.10 వేలు ఉంటుందని బాధిత రైతులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement