శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియా వాటర్ ట్యాంక్ ప్రాంతానికి చెందిన కార్మిక నాయకుడు జక్కుల రాజేశం శ్రమశక్తి అవార్డుకు ఎంపికయ్యారు. శుక్రవారం రవీంద్రభారతిలో జరిగే మేడే వేడుకల్లో కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. 1986లో సింగరేణి సంస్థలో చేరిన రాజేశం సాజక్, ఏఐటీయూసీ, టీఎన్‌టీయూసీ, టీబీజీకేఎస్ సంఘాల్లో క్రీయాశీలకంగా పని చేశారు. సికాస ఉద్యమం బలంగా ఉన్న సమయంలో వారితో కలిసి పోరాడి శ్రీరాంపూర్ ఏరియాలోని అరుణక్కనగర్, సుందరయ్యనగర్, తదితర సింగరేణి భూముల్లో కార్మికులకు గుడిసెలు వేయించారు. తాళ్లపల్లి ఎంపీటీసీగా, సర్పంచ్‌గా సేవలందించారు. అమరులైన కార్మికులను స్మరించుకోవాలనే ఉద్దేశంతో శ్రీరాంపూర్ బస్టాండ్‌లో కార్మిక విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. ఎన్టీఆర్ విగ్రహం, బస్టాండ్ ఆయన సర్పంచ్‌గా ఉన్న సమయంలో ఏర్పాటు చేసినవే. 2018లో రిటైర్డ్ అయినప్పటికీ ఇప్పటికీ కార్మికుల సమస్యలపై తన గళం విప్పుతూనే ఉన్నారు. కార్మికవర్గ పోరాటాల్లో ఆయన చేసిన కృషిని గుర్తించిన ప్రభుత్వం శ్రమశక్తి అవార్డుకు ఎంపిక చేసింది.
శ్రీరాంపూర్: ఐఎన్‌టీయూసీ కేంద్ర, బ్రాంచి ఉపాధ్యక్షుడు జెట్టి శంకర్‌రావు శ్రమశక్తి అవార్డుకు ఎంపికయ్యారు. 1987లో సింగరేణిలో ఉద్యోగంలో చేరిన శంకర్‌రావు ప్రస్తుతం శ్రీరాంపూర్ సీహెచ్‌పీలో ఎలక్ట్రీషియన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 40 సంవత్సరాలుగా ఒకే సంఘంలో పని చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. కార్మికుల సమస్యల పరిష్కారంలో ముందుండడమే కాకుండా అందరితో సన్నిహితంగా మెలుగుతారు. తనకు అవార్డు రావడం సంతోషకరంగా ఉందన్నారు.


