కైలాస్‌నగర్: ఆదిలాబాద్ జిల్లా అగ్నిగుండంలా మారింది. మే ప్రారంభానికి ముందే భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. గురువారం రాష్ట్రంలోనే జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్ పట్టణంలో 46 డిగ్రీలు నమోదైంది. మిగతా మండలాల్లో 44 నుంచి 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఉదయం 10గంటలకే భానుడు భగ్గుమంటున్నాడు. భగభగ మండే ఎండల తీవ్రతకు జనాలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అత్యవసర పనుల కోసం బయటకు వెళ్లే వారు గొడుగులు, రక్షణ కవచాలు ధరిస్తున్నారు. ఎండల తీవ్రతతో ఇళ్లలోని కూలర్లు, ఫ్యాన్లు పని చేయని పరిస్థితి ఉంది. మనుషులతోపాటు పశుపక్షాదులు, మూగజీవాలు ఎండ తీవ్రతకు అల్లాడుతున్నాయి. ఎండలకు తోడు ఉక్కపోతతో వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పలుచోట్ల వడదెబ్బ బారిన పడి మరణాలు కూడా సంభవిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నందునా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


