సాక్షి,ఆదిలాబాద్: ఈ వానాకాలం సాగు విస్తీర్ణాన్ని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. పత్తి, సోయా, కంది, జొన్న, మొక్కజొన్న, వరి, పెసర, మినుము ఇతరత్రా పంటలు సాగు కానున్నాయి. గతేడాదితో పోల్చితే ఈసారి పత్తి విస్తీర్ణం స్వల్పంగా తగ్గనుంది. ఇక సోయా, కందుల విస్తీర్ణం కొంత పెరుగనుంది. ఓ వైపు వ్యవసాయ శాస్త్రవేత్తలు పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో అన్ని పంటలు కలిపి గతేడాది సుమారు 5లక్షల 85వేల 350 ఎకరాల్లో సాగయ్యాయి. ఇందులో అత్యధికంగా 73 శాతం పత్తి సాగైంది. ఈఏడాది కూడా పత్తి పంటనే అత్యధికంగా సాగు చేయనున్నారు. అయితే గతంతో పోల్చితే స్వల్పంగా తగ్గనున్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. సోయా, కందుల విస్తీర్ణం స్వల్పంగా పెరగనుంది. దీనికి తగ్గట్టుగా విత్తనాల ఆవశ్యకతపై వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది.
గంపెడాశలు..
జిల్లాలో ప్రధానంగా వానాకాలమే ఎక్కువగా పంటలు సాగవుతాయి. యాసంగి సాగు అంతంత మాత్రంగానే ఉంటుంది. వానాకాలంలో సాగు చేసే పత్తి, సోయా, కంది దిగుబడులపై రైతులు ఎన్నో ఆశలతో ముందుకు సాగుతారు. ఈ ఏడాది కూడా ఈ మూడు పంటలే ప్రధానంగా సాగయ్యే అవకాశం ఉంది. గతేడాది అధిక వర్షాలతో రైతులు పంట నష్టం చవిచూశారు. అయితే ఈ సారి ప్రకృతి సహకరించాలని వారు వేడుకుంటున్నారు.
నకిలీల బెడద..
వానాకాలం సాగు సమీపిస్తుండగా, ప్రస్తుతం నకిలీ విత్తనాల బెడద మార్కెట్‌ను ముంచెత్తుతుంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల వీటిని పోలీసులు పట్టుకున్నారు. లూజ్ విత్తనాలతో పాటు కంపెనీలకు సంబంధించిన బ్రాండ్‌లతో పూర్తిగా నకిలీ విత్తనాల ప్యాకెట్లను తయారు చేసి విక్రయిస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది.
పంటల సాగు అంచనా విస్తీర్ణం
ఇలా.. (ఎకరాల్లో)
పంట 2025 2026
పత్తి 4,32,285 4,26,500
సోయా 72,235 78,000
కంది 44,447 45,000
మొక్కజొన్న 38,630 39,000
ఇతరత్రా 2,735 2,500
విత్తనాల అవసరం..
పత్తి : 11లక్షల 50వేల ప్యాకెట్లు
(450 గ్రాములు)
మొక్కజొన్న: 3,200 క్వింటాళ్లు
కంది: 1800 క్వింటాళ్లు
సోయా: 23వేల క్వింటాళ్లు
సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచుతాం
వానాకాలం సాగు విస్తీర్ణాన్ని అంచనా వేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా విత్తనాలను అందుబాటులో ఉంచుతాం. పత్తి విత్తనాలకు సంబంధించి ఎలాంటి కొరత లేకుండా రైతులకు నాణ్యమైనవి అందుబాటులోకి తీసుకొస్తాం. నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దు. – శ్రీధర్ స్వామి,
జిల్లా వ్యవసాయ అధికారి, ఆదిలాబాద్


