కై లాస్‌నగర్: జిల్లాలో చేపట్టిన జాతీయ రహదారి 353(బి) నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రెండేళ్ల క్రితం ప్రారంభం కాగా, ఈఏడాది మే చివరి లోపు పూర్తి చేయాల్సి ఉంది. ఓ వైపు గడువు సమీపిస్తున్నా పనుల ప్రగతిని పరిశీలిస్తే సకాలంలో పూర్తికావడం గగనమే అనిపిస్తోంది. కాంట్రాక్టర్ పనుల్లో తీవ్ర జాప్యం చేస్తుండటంతో పాటు నిబంధనలు పాటించడం లేదనే విమర్శలున్నాయి. అధికారుల పర్యవేక్షణ కరువవడమే కారణంగా తెలుస్తోంది.
పనుల్లో తీవ్ర జాప్యం..
భోరజ్ మండలకేంద్రంలోని ఎక్స్‌రోడ్ నుంచి జైనథ్, బేల మీదుగా మహారాష్ట్రలోని అష్టి వరకు గల ఆర్‌అండ్‌బీ పరిధిలోని రోడ్డును కేంద్రం భారత్‌మాల పథకం కింద జాతీయ రహదారిగా మార్చింది. అక్కడి నుంచి ఇక్కడి వరకు 141కిలోమీటర్లు ఉండగా, జిల్లాలో 33 కిలోమీటర్లు మాత్రమే విస్తరిస్తున్నారు. మహారాష్ట్ర ప్రాంతంలో ఎన్‌హెచ్‌ఏఐ నిర్మాణం పూర్తి చేయగా, ఇక్కడ పది మీటర్ల మేర రోడ్డును విస్తరిస్తున్నారు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే చేపడుతున్న నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. టెండర్ పొందిన కాంట్రాక్టర్ 2024 అక్టోబర్‌లో పనులు ప్రారంభించారు. ఈ ఏ డాది మే చివరి నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉంది. అయితే పనుల్లో తీవ్ర జాప్యం చేస్తుండటంతో గడువులోపు పూర్తి చేయడం కష్టతరంగా మారింది.
లోపించిన పర్యవేక్షణ..
గడువులోపు పనులు పూర్తయ్యేలా పర్యవేక్షించాల్సి న సంబంధిత అధికారులు ఆ దిశగా దృష్టి సారించడం లేదు. దీంతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా ప నులు చేపడుతున్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్ర కారం రోడ్డుకు ఇరువైపులా మొరం నింపాల్సి ఉండగా, పక్కనే పొక్లెయిన్లతో తవ్వుతూ నల్లమట్టితో నింపుతున్నారు. ఇది కనిపించకుండా ౖపైపెన మొ రం వేస్తున్నారు. దీంతో వర్షాకాలంలో మట్టి కొట్టుకుపోయే అవకాశముంది. అలాగే తర్నం, జైనథ్, కొబ్బాయి సమీపంలో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులపై పర్యవేక్షణ లోపించింది. ఈ పనులు కూడా నిబంధనల మేరకు సాగడం లేదనే విమర్శలున్నాయి.
నాణ్యతతో జరిగేలా చూస్తాం..
జాతీయ రహదారి నిర్మాణ పనులను ఈ ఏడాది మే నాటికి పూర్తి చేయాల్సి ఉంది. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు ఉండడంతో కూలీల కొరత ఏర్పడి పనులు సకాలంలో సాగలేదు. పలుచోట్ల భూసేకరణ చేయాల్సి ఉండటం, బ్రిడ్జి పనులు కొనసాగుతున్నందున గడువు మరో ఆరు నెలలు పొడిగించే అవకాశం ఉంది. నాణ్యత ప్రమాణాల మేరకు పనులు జరిగేలా దృష్టి సారిస్తాం. ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడి నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు చేపడతాం.
– సుభాష్, డీఈ, ఎన్‌హెచ్
నిత్యం అవస్థలే..
అంతర్రాష్ట్ర రహదారి కావడంతో నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. బేల, జైనథ్ మండలాల ప్రజలు జిల్లా కేంద్రానికి ఈ మార్గం గుండానే ప్రయాణిస్తారు. నత్తనడకన సాగుతున్న ఈమార్గంలో ప్రయాణం వాహనదారుల పాలిట శాపంగా మారుతుంది. తేలిన కంకరతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.


