అధిక మిత్తీలతో ప్రజల నడ్డి విరుస్తున్న వ్యాపారులు
భూములు, ఇంటి పత్రాల తాకట్టు పెట్టుకొని..
సామాన్యులను అప్పుల ఊబిలోకి నెడుతున్న వైనం
ప్రత్యేక బృందాలతో పోలీసుల తనిఖీలు
ఇటీవల 15 కేసులు నమోదు
ఆదిలాబాద్‌టౌన్: అధిక మిత్తీలతో ప్రజల నడ్డి విరుస్తున్న వడ్డీ వ్యాపారులపై జిల్లా పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. అమాయక ప్రజలు, రైతుల అవసరాలు ఆసరా చేసుకొని అప్పులు ఇచ్చి వ్యవసాయ భూములు, ఇంటి స్థలాలు, బంగారు ఆభరణాలు, ఇతర ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఎక్కువ మొత్తంలో వడ్డీ వసూలు చేయడంతో కొంత మంది చేసిన అప్పులు తీర్చలేక వారు కుదుపెట్టిన అస్తులు వ్యాపారుల పాలవుతున్నాయి. జిల్లాలో ఇలాంటి ఘటనలు ఇటీవల అనేకంగా చోటు చేసుకున్నాయి. పిల్లల చదువు, కుటుంబ సభ్యులకు ఆరోగ్యం బాగా లేకపోవడం, ఆడపిల్లల పెళ్లి, వ్యవసాయం తదితర పనుల కోసం అప్పులు చేస్తున్నారు. సాధారణ వడ్డీ తీసుకుంటే అప్పు చెల్లించడానికి వీలుంటుంది. కానీ చాలా మంది నెల వారీగా 6నుంచి 10శాతం వరకు తీసుకుంటున్నారు. ఈ వ్యాపారులు అప్పు తీసుకున్న వారిని మానసికంగా వేధించడంతో అవమానభారంతో కొందరు ఆత్మహత్య చేసుకుని తనవు చాలిస్తున్నారు. బాధిత కుటుంబాలు పెద్ద దిక్కు కోల్పోవడంతో రోడ్డున పడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇటీవల పలువురు బాధితులు తమ గోడును ఎస్పీ అఖిల్ మహాజన్ దృష్టికి తీసుకెళ్లడంతో పోలీసులు వ్యాపారుల ఇళ్లపై దాడులు చేసి అప్పు పత్రాలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి అక్రమ ఆగడాలకు చెక్ పెడుతున్నారు. దీంతో బాధితుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
ప్రజల నడ్డి విరుస్తున్న వ్యాపారులు..
జిల్లాలో వడ్డీ వ్యాపారుల దందా జోరుగా సాగుతుంది. జిల్లా కేంద్రంతో పాటు, గ్రామీణ ప్రాంతా ల్లో చోటామోటా వ్యాపారులు, కొంత మంది ప్రభు త్వ ఉద్యోగులు, మరికొంత మంది టీచర్లు ఈ అక్రమార్జనపై దృష్టి సారిస్తున్నారు. మధ్యవర్తుల ద్వారా డబ్బులు వడ్డీకి ఇస్తున్నారు. సామాన్యుల, రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక మిత్తీ వసూలు చేస్తున్నారు. అప్పు ఇచ్చే సమయంలో ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు, చెక్కులు, స్టాంప్‌పేపర్లు, ఇంటి స్థలాల పత్రాలను వారి వద్ద కుదువ పెట్టుకుంటున్నారు. ఇటీవలభూములు, ఖాళీ ప్లాట్లను రిజిస్ట్రేషన్, మార్టిగేజ్ చేసుకుంటున్నారు. అప్పు చెల్లింపు కోసం నిర్ణీత గడువు రాసుకుంటున్నారు. అ లోపు తిరిగి ఇవ్వకపోతే వారి అస్తులు వ్యాపారుల పాలవుతున్నాయి. ఇలా భూములు, బంగారు ఆభరణాలు పోగొట్టుకున్న వారు అనేకం ఉన్నారు.


