ఆదిలాబాద్: దేశంలో మహిళా సాధికారతకు పట్టం కడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల అమలు ఖాయమని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మహిళా ఆగ్రహ సభలో ఆయన మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ల అమలే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. ఇందు కోసం ఆర్టికల్ 81కు 131వ రాజ్యాంగ సవరణను ప్రభుత్వం ప్రతిపాదించిందని తెలిపారు. దీనిపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో దేశ జనాభాకు అనుగుణంగా లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న 543 స్థానాలను 815కి పెంచే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ పునర్విభజన ప్రక్రియ వల్ల ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాల్లో భారీ మార్పులు వస్తాయని వివరించారు. పెరిగిన స్థానాల్లో మహిళలకు 33 శాతం కేటాయించడం ద్వారా అణగారిన వర్గాలకు చట్టసభల్లో అధిక ప్రాతినిధ్యం లభిస్తుందని, ఇది నిజమైన సామాజిక న్యాయమని అభిప్రాయపడ్డారు. 1971 జనాభా లెక్కల ప్రకారం 1976లో నిర్ణయించిన 543 సీట్లనే ఇప్పటికీ కొనసాగించాలని చూడటం హాస్యాస్పదమన్నారు. 50 ఏళ్లు గడిచినా నియోజకవర్గాల పెంపును కాంగ్రెస్ వ్యతిరేకించడం వెనుక భారీ కుట్ర ఉందని ఆరోపించారు. జనాభా ప్రాతిపదికన వాటా కావాలని కోరుతున్న రాహుల్ గాంధీ, నియోజకవర్గాల పెంపును ఎందుకు వ్యతిరేకిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కోవిడ్ వల్ల ఆలస్యమైన దేశవ్యాప్త జనగణన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని వివరించారు. ఇది 2027–28 నాటికి పూర్తవుతుందని వెల్లడించారు. ఆ గణాంకాల ఆధారంగానే శాసీ్త్రయంగా పునర్విభజన ప్రక్రియ జరుగుతుందని, ఆ వెంటనే 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలవుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఇందులో ఎమ్మెల్యే పాయల్ శంకర్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సుమన్ రాథోడ్, ధోని జ్యోతి, చిలుకూరి జ్యోతిరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముస్తాపురే అశోక్ తదితరులు పాల్గొన్నారు.


