కై లాస్‌నగర్(బేల): నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న రాకెట్‌ను బేల పోలీసులు ఛేదించారు. అక్రమంగా విక్రయిస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 150 నకిలీ విత్తన ప్యాకెట్లతో పాటు వారి వద్ద నుంచి రూ.60 వేల నగదు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. శనివారం బేల పోలీస్ స్టేషన్‌లో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి ఈ మేరకు వివరాలు వెల్లడించారు. బేల మండలం సాంగిడి శివారులో రోడ్డు పక్కన కొందరు నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నట్లు సమాచారం అందింది. పోలీస్ సిబ్బంది అక్కడికి వెళ్లి తనిఖీలు చేపట్టారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ విత్తనాలు నకిలీవా కావా అనేదాన్ని నిర్ధారించేందుకు వ్యవసాయ అధికారిని సంఘటన స్థలానికి పిలిపించి పరిశీలించగా అవి నకిలీవని నిర్ధారించినట్లు డీఎస్పీ తెలిపారు.
పత్తి విత్తన ప్యాకెట్ తయారీ చేసి..
నిందితుడు సాంగిడి గ్రామానికి చెందిన జిట్టావార్ కిశోర్‌రెడ్డి గుజరాత్‌కు చెందిన నరేశ్ క్రాప్ సైన్స్ కంపెనీలో కమిషన్ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. అదే కంపెనీలో పని చేసే ధర్మేష్ కచ్చడియాతో కలిసి కుట్రపన్ని మౌళి 555తో ఉన్న నిజమైన పత్తి విత్తన ప్యాకెట్‌ను తయారు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. రెండు నెలలుగా గుజరాత్ నుంచి నవత ట్రాన్స్‌పోర్ట్ ద్వారా సుమారు 4,500 నకిలీ విత్తనాల ప్యాకెట్లు తెప్పించారని డీఎస్పీ తెలిపారు. అందులో 4 వేల ప్యాకెట్లను మహారాష్ట్రలోని ఝరి జామ్ని గ్రామానికి చెందిన రక్తావర్ పవన్ ద్వారా 350 ప్యాకెట్లను సాంగిడికి చెందిన నవగరే కునాల్, మణియార్‌పూర్‌కు గ్రామానికి చెందిన కుల్దీప్ టాక్రె ద్వారా రైతులకు అసలైన విత్తనాలుగా నమ్మించి విక్రయించినట్లు విచారణలో తేలింది. రెండు ప్యాకెట్లను నమూనా తీసుకుని పరీక్షకు పంపించి, మిగతా వాటిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. సమావేశంలో ఆది లాబాద్ రూరల్ సీఐ కె. ఫణిదఽర్, ఎస్సై మధుకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


