ఆపరేషన్‌ క్రాక్‌డౌన్‌లో భారీ సైబర్‌ మోసాలు | - | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ క్రాక్‌డౌన్‌లో భారీ సైబర్‌ మోసాలు

Apr 26 2026 2:57 AM | Updated on Apr 26 2026 2:57 AM

● 74 అనుమానాస్పద బ్యాంక్‌ ఖాతాల గుర్తింపు..12 కేసుల నమోదు ● ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లా పోలీసులు ఆపరేషన్‌ క్రాక్‌డౌన్‌లో భాగంగా భారీ సైబర్‌ మోసం గుట్టురట్టు చేశారు. 74 అనుమానాస్పద బ్యాంకు ఖాతాలను గుర్తించారు. 12 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. రూ.7 కోట్లకు పైగా జరిగిన బ్యాంకు లావాదేవీలను గుర్తించారు. మ్యూల్‌ అకౌంట్ల ద్వారా ఆన్‌లైన్‌ గేమింగ్‌, బెట్టింగ్‌, ఫేక్‌ ట్రేడింగ్‌ మోసాలను గుర్తించారు. శనివారం స్థానిక ఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌ సమావేశ మందిరంలో ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ ఈమేరకు వివరాలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా నమోదైన ఎన్‌సీఆర్‌పీ ఫిర్యాదులతో ఈ అకౌంట్లు అనుసంధానమై ఉన్నట్లు గుర్తించామన్నారు. ప్రజలు తమ బ్యాంక్‌ ఖాతాలను స్నేహితులు, బంధువులు, ఇతరులకు ఇవ్వడం నేరమని స్పష్టం చేశారు. అలా చేసిన వారిపై అరెస్ట్‌, ఖాతాల ఫ్రీజింగ్‌, ఎన్‌సీఆర్‌పీలో నమోదు వంటి చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సైబర్‌ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌ లేదా సమీప పోలీస్‌ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు. సైబర్‌ నేరాలపై, మ్యూల్‌ అకౌంట్‌ హోల్డర్లపై, గేమింగ్‌కు సంబంధించిన అక్రమ ఆర్థిక లావాదేవీలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్‌ డిఎస్పీ ఎల్‌. జీవన్‌ రెడ్డి, సైబర్‌ క్రైమ్‌ ఎస్సై గోపికష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

నిందితుల రిమాండ్‌

ఈ కేసులో నిందితులను గుర్తించి రిమాండ్‌కు పంపినట్లు ఎస్పీ తెలిపారు. ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన అవేస్‌ ఖాన్‌, మడావి ఘన్‌శ్యామ్‌, జాధవ్‌ సంతోష్‌, సురం ఆశమ్మ, జక్కుల ప్రవీణ్‌, సురం విశ్వేశ్వర్‌, రాథోడ్‌ మనోజ్‌, జి.ఆర్యన్‌గౌడ్‌, జాధవ్‌ గోవర్ధన్‌, షేక్‌ సమీర్‌, చౌహన్‌ గోపాల్‌ గేమింగ్‌ యాప్స్‌, బెట్టింగ్‌ ప్లాట్‌ఫార్‌మ్స్‌, ఫేక్‌ ట్రేడింగ్‌, టాస్క్‌, రివ్యూ మోసాల ద్వారా అక్రమ డబ్బు మార్పిడి జరిపినట్లుగా విచారణలో వెల్లడైంది. షెర్ల రాజవర్ధన్‌, పేట్లశ్రీ అక్షయ్‌, రాజేందర్‌, షేక్‌ సమీర్‌ను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement