ఆదిలాబాద్: తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు మూడు రోజుల పాటు చేసిన సమ్మె శనివారంతో ముగిసింది. ఈ నెల 22నుంచి 24వరకు వినూత్న ఆందోళనలతో ని రసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రజా రవాణా వ్యవస్థకు ఆటంకం కలిగింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే కార్మిక జేఏసీతో ప్రభుత్వం శుక్రవారం జరిపిన చర్చలు సఫలం కావడంతో బస్సులు పూర్తిస్థాయిలో రోడ్డెక్కాయి. మరోవైపు తమ డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో కార్మికుల్లో హర్షం వ్యక్తమైంది. ఆయా డిపోలు, బస్టాండ్ల వద్ద సంబరాల్లో మునిగితేలారు.
బస్సులన్నీ అందుబాటులోకి..
సమ్మె ముగియడంతో అన్ని బస్సులు రోడ్డెక్కాయి. ఉదయం నుంచే కార్మికులు విధుల్లో చేరారు. దీంతో ప్రయాణికులతో బస్టాండ్లు కిటకిటలాడాయి. సమ్మె జరిగిన మూడు రోజుల్లో అరకొరగా బస్సులు నడవగా, శనివారం పల్లె వెలుగు మొదలుకొని రాజధాని వరకు అన్ని సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. రీజియన్ వ్యాప్తంగా ఉన్న మొత్తం 641 బస్సులు నడిచినట్లు అధికారులు తెలిపారు.
కార్మికుల సంబరాలు..
కార్మిక జేఏసీ నాయకులతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆదిలాబాద్ డిపో వద్ద కార్మికులు సంబరాలు జరుపుకున్నారు. నర్సంపేటలో నిప్పంటించుకుని అమరుడైన శంకర్‌గౌడ్ చిత్రపటానికి ముందుగా నివాళులర్పించారు. అనంతరం సీఎం, మంత్రుల ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. డిపో నుంచి బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లారు. టపాసులు కాల్చి స్టెప్పులేస్తూ హర్షం వ్యక్తం చేశారు.


