మరోసారి ప్లాట్ల అక్రమ రిజిస్ట్రేషన్లకు.. ఆదిలాబాద్ ఎస్‌ఆర్‌వోలో ప్రణాళిక ఇన్‌చార్జి సబ్‌రిజిస్ట్రార్ సెలవులో వెళ్లేలా ప్లాన్ ఓ జూనియర్ అసిస్టెంట్‌తో వ్యవహారం సాగించేలా పావులు అనధికారిక లేఔట్లలోని వందలాది ప్లాట్లకు ఒప్పందం..?
సాక్షి,ఆదిలాబాద్: ప్రతీవారం ఏదో రోజు.. ఏదో ఒక సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై అవినీతి శాఖ దాడులు రాష్ట్రంలో జరుగుతుండటం మనం చూస్తున్నాం. ఎస్‌ఆర్‌వో కార్యాలయాల్లో కరప్షన్ రోజురోజుకు పెరిగిపోతుండడంతోనే ఈ దాడులు జరుగుతున్నాయనే ప్రచారం సాగుతుంది. ఇంత జరుగుతున్నా వారి దారి వారిదే అన్నట్టు ఎస్‌ఆర్‌వో కార్యాలయాల్లో ఎలాంటి జంకు లేకుండా అక్రమ వ్యవహారాలు సాగించేస్తున్నారు. అలాంటిదే ఆదిలాబాద్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఓ అక్రమ వ్యవహారం కోసం ప్రణాళిక చకచకా రూపొందుతుందనే ప్రచారం ప్రస్తుతం జోరుగా సాగుతుంది. అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదంటూ చెబుతున్నప్పటికీ తెర వెనుక మాత్రం వ్యవహారం పకడ్బందీగా చేపట్టేందుకు వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం.
ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్‌గా ఓ అధికారి కొనసాగుతున్నారు. జాయింట్–2 సబ్ రిజిస్ట్రార్‌గా ఇన్‌చార్జి హోదాలో ఓ మహిళ అధికారి కొనసాగుతున్నారు. వచ్చే నెల మొదటి వారంలో మహిళ అధికారి వ్యక్తిగత కారణాలతో సెలవులు తీసుకుంటున్నారని, ఆ స్థానంలో ఓ జూనియర్ అసిస్టెంట్‌ను ఇన్‌చార్జిగా నియమించి అనధికారిక లేఔట్లలోని వందలాది ప్లాట్లను అక్రమ రిజిస్ట్రేషన్లు చేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారనే ప్రచారం జోరుగా సాగుతుంది.
డీడబ్ల్యూవోలతో రహస్య ఒప్పందం..?
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట సుమారు 30 మంది వరకు డాక్యుమెంట్ రైటర్లు పనిచేస్తుండటం నిత్యం కనిపిస్తుంది. ఇటీవల ఈ డాక్యుమెంట్ రైటర్లలో కొంత మంది రిజిస్ట్రేషన్ అధికారులతో ఈ అనధికారిక లేఔట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్ల విషయంలో ఓ ఒప్పందం చేసుకున్నారనే ప్రచారం సాగుతుంది. సుమారు 400 నుంచి 500 ప్లాట్ల రిజిస్ట్రేషన్ల కోసం పక్కా ప్రణాళిక రూపొందించారని చెప్పుకుంటున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా ఉన్న అధికారిణి సెలవుల్లో వెళ్లేలా.. ఓ జూనియర్ అసిస్టెంట్‌ను ఆ స్థానంలో ఇన్‌చార్జిగా నియమించి ఆ ప్లాట్లన్నింటినీ చకచకా రిజిస్ట్రేషన్ చేసేలా వ్యూహం రూపొందించారనే ప్రచారం సాగుతుంది. ఇందులో ప్రతీ ప్లాట్‌కు వేలాది రూపాయల చొప్పున పెద్ద ఎత్తున అధికారులకు ముట్టజెప్పేలా ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది.
ప్రభుత్వం నుంచి నిషేధం ఉన్నప్పటికీ గతేడాది అనధికారిక లేఔట్లలో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమయ్యాయి. వీటికి సంబంధించి గతేడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో ‘స్కెచ్ రెడీ’ శీర్షికన ‘సాక్షి’లో మొదట కథనం ప్రచురితమైంది. ఆ తర్వాత వరుస కథనాలు రావడంతో ఈ వ్యవహారంలో అప్పుడు ఇన్‌చార్జి జిల్లా రిజిస్ట్రార్‌గా ఉన్న ప్రసన్న విచారణ చేపట్టారు. డీఐజీకి రిపోర్టు అందజేశారు. ఇక ఆ సబ్‌రిజిస్ట్రార్‌పై చర్యలు తప్పవని అనుకున్నప్పటికీ వారు నామమాత్రంగా ఇక్కడి నుంచి భైంసా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి అతడిని పంపించి మమా అనిపించారు. ఇలా పై అధికారులు కొంత మంది కిందిస్థాయి అధికారులను అక్రమ రిజిస్ట్రేషన్ల కోసం నియమించి కోట్ల రూపాయల ఒప్పందాలతో అనధికారిక లేఔట్లలో ప్లాట్లను గంపగుత్తగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా దొడ్డిదారిన స్కెచ్‌లు రూపొందించి అమలు చేయడం పరిపాటిగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


