కై లాస్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసి గృహ ప్రవేశాలను చేయించాలని ఆదేశించింది. అయితే జిల్లాలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల ప్రగతిని పరిశీలిస్తే ఆ లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు. పనులు నత్తనడకన సాగుతుండటమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.
ఇదీ పరిస్థితి..
పేదల సొంతింటి కల సాకారం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకానికి శ్రీకారం చుట్టింది. ఒక్కో నిర్మాణానికి నాలుగు విడతల్లో రూ.5లక్షల ఆర్థికసాయం అందిస్తోంది. పథకంలో భాగంగా తొలి విడతగా ఒక్కో నియోజకవర్గానికి 3500 చొప్పున ఇళ్లను మంజూరు చేసింది. ఎస్టీ నియోజకవర్గం, పీవీటీజీ గిరిజనులకు మరో వెయ్యి నుంచి 1500 ఇళ్లను అదనంగా కేటాయించింది. గ్రామీణ ప్రాంతాల్లో గతేడాది ఫిబ్రవరి, మార్చిలో ఇళ్లు మంజూరు కాగా, పట్టణ ప్రాంతాల్లో మే, జూన్ నెలల్లో ఈ ప్రక్రియ చేపట్టారు. ప్రారంభంలో నిర్మాణాలకు లబ్ధిదారులు అంతగా ఆసక్తి చూపలేదు. ఆర్థిక స్థోమత లేకపోవడం, బిల్లులు సకాలంలో వస్తాయో రావోననే కారణాలతో నిర్మాణాలకు వెనుకడుగు వేశారు. అయితే పూర్తయిన ఇళ్లకు బిల్లులు వస్తుండటంతో మిగతా వారిలో ఆసక్తి పెరిగింది. పనులు వేగవంతం చేశారు.
ఇప్పటి వరకు పూర్తయింది 975 మాత్రమే ..
జిల్లాలో సుమారు 16వేల ఇళ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు కేవలం 975 మాత్రమే పూర్తయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. 2,099 ఇళ్లు ఇప్పటికీ ప్రారంభానికే నోచుకోలేదు. మంజూరు పత్రాలు పొందిన లబ్దిదారులు వాటిని ప్రారంభించడం కూడా అనుమానంగానే కనిపిస్తోంది. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఈ నెల చివరి వారంలో, రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా జూన్ మొదటి వారంలో పెద్ద ఎత్తున గృహప్రవేశాలు చేయించాలని భావించిన ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసేలా చర్యలు చేపట్టింది. ప్లాస్టరింగ్, ఇంటరీయర్ వర్క్స్ పూర్తికానప్పటికీ స్లాబ్ వేసి, దర్వాజా బిగించి, బయట ప్లాస్టరింగ్ కలరింగ్ చేసిన ఇళ్లకు తుది విడత బిల్లులు చెల్లించాలని నిర్ణయించింది. తద్వారా నిర్మాణాలు వేగవంతమవుతాయని భావించింది. అయినప్పటికి ఆశించిన స్థాయిలో ముందకు సాగడం లేదు. ఇటీవల సిమెంట్, ఇసుక, స్టీల్ సామగ్రి ధరలు పెరగడం కూడా నిర్మాణాలపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
జిల్లాలో..
మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు : 16,093
పూర్తయినవి : 975
మార్కవుట్ ఇచ్చినవి : 2,235
బెస్‌మెంట్ స్థాయిలో ఉన్నవి: 5,583
రూప్‌స్థాయిలో ఉన్నవి : 2,489
స్లాబ్ దశలో ఉన్నవి : 2,712
ఇప్పటికి ప్రారంభం కానివి: 2,099
నిర్మాణాల వేగవంతంపై దృష్టి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాం. నిత్యం గ్రామాలను సందర్శిస్తూ త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నాం. ఇంటి లోపల పనులు పూర్తికానప్పటికీ ప్లాస్టరింగ్, కలరింగ్ చేసి దర్వాజా ఏర్పాటు చేస్తే తుది విడత బిల్లులు కూడా చెల్లిస్తున్నాం. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రారంభం కాని ఇళ్ల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వారి ఆదేశాలకనుగుణంగా చర్యలు తీసుకుంటాం.
– రెడ్డి శంకర్, హౌసింగ్ పీడీ, ఆదిలాబాద్


