ఆదిలాబాద్‌టౌన్: పోలీసులపై ప్రజల్లో నమ్మకం పెంచేలా విధులు నిర్వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ప్రజా ఫిర్యాదుల విభాగంలో భాగంగా సోమవారం పోలీసు కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 38 మంది తమ సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ చేసి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఇందులో కుటుంబ కలహాలు, భార్య భర్తల సమస్యలు, గొడవలు వంటివి ఉన్నాయి. కార్యక్రమంలో ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్ కవిత, సిబ్బంది పాల్గొన్నారు.
రిసెప్షనిస్టుల పాత్ర కీలకం
పోలీస్‌స్టేషన్లలో రిసెప్షనిస్టుల పాత్ర కీలకమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లాలోని రిసెప్షనిస్టులతో సోమవారం సమావేశం నిర్వహించారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. బాధితులకు సత్వర న్యాయం అందేలా కృషి చేయాలన్నారు. ఫిర్యాదులు స్వీకరించిన వెంటనే స్టేషన్ ఇన్‌చార్జి ద్వారా విలేజ్ పోలీసు ఆఫీసర్‌కు దర్యాప్తు కోసం అప్పగించాలని సూచించారు. సంఘటన స్థలంలో ఉన్న వాంగ్మూలాన్ని నమోదు చేసి వారి సంతకాలతో కూడిన రిపోర్టును రిసెప్షనిస్టుకు అందజేయాలన్నారు. రాజీ పడితే ఇరువురితో రాజీపత్రం నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో మహిళాస్టేషన్ సీఐ ప్రేమ్‌కుమార్, డీసీఆర్‌బీ ఎస్సై ప్రవీణ్, రిసెప్షనిస్టులు పాల్గొన్నారు.


