సోలార్‌.. బడులు | - | Sakshi
Sakshi News home page

సోలార్‌.. బడులు

Apr 20 2026 8:35 AM | Updated on Apr 20 2026 8:35 AM

● జిల్లాలో 179 పాఠశాలలు ఎంపిక ● 2 నుంచి 10 కిలోవాట్ల సామర్థ్యంతో.. ● కిలోవాట్‌కు రూ.లక్ష చొప్పున నిధులు

ఆదిలాబాద్‌టౌన్‌: సర్కారు బడుల్లో సోలార్‌ కాంతులు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ ద్వారా ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించింది. ఈమేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది పలు పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మ రోవైపు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు విద్యుత్‌ సంస్థకు డబ్బులు చెల్లించా ల్సి ఉంటుంది. ఈ భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం సోలార్‌ విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకువస్తుంది. జిల్లాలో తొలివిడతగా 179 పాఠశాలల్లో ఏర్పాటు చేయనున్నారు. వీటిలో కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లు, ప్రభుత్వ, జెడ్పీ యాజమాన్య, ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. త్వరలో మిగతా వాటిలో కూడా ఏర్పాటు చేయనున్నారు.

తగ్గనున్న విద్యుత్‌ భారం..

సోలార్‌ ఏర్పాటుతో సర్కారు బడుల్లో విద్యుత్‌ బిల్లుల భారం తగ్గనుంది. ప్రభుత్వ సంస్థల్లో ఉత్పత్తి చేస్తున్న సోలార్‌ విద్యుత్‌లో అవసరం మేరకు వాడుకొని మిగిలిన దాన్ని వదిలేసే పరిస్థితి ఉంది. ఇకపై అలా కాకుండా అవసరాల మేరకు వినియోగించుకొని మిగిలిన దాన్ని గ్రిడ్‌ ద్వారా డిస్కౌంట్లకు విక్రయించుకునే అవకాశం ఉంది. బడుల్లో కంప్యూటర్లు, ఫ్యాన్లు, మోటార్‌ నడవడానికి ఎక్కువ కరెంట్‌ వినియోగిస్తున్నారు. సోలార్‌ ప్యానళ్ల ఏర్పాటుతో ప్రతీ పాఠశాలలో రెండు కిలోవాట్స్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేయనున్నారు. కిలోవాట్‌కు రూ.లక్ష చొప్పున ఖర్చవుతుంది. ఇలా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానిస్తారు. బ్యాటరీ ఇన్వర్టర్‌ ద్వారా నిలువ చేసుకుని అవసరం మేరకు వినియోగించుకోనున్నారు. ఈ నిర్వహణ ఖర్చులు ప్రభుత్వం భరించనుంది. ఐదేళ్ల పాటు సంస్థతో నిర్వహణ ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలో ఇందుకు సంబంధించిన టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు.

విద్యార్థులకు ప్రయోజనం..

సోలార్‌ ప్యానళ్ల ఏర్పాటుతో పాఠశాలల్లో ఇక విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉండదు. వీటి ఏర్పాటుతో ప్రభుత్వానికి కూడా విద్యుత్‌ భారం తగ్గనుంది. మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించడం ద్వారా ఆయా పాఠశాలల అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయి. వీటిని బడుల అభివృద్ధికి వినియోగించవచ్చు.

జిల్లాలో డీఈవో పరిధిలో పాఠశాలలు 739

ప్రాథమిక 500, ప్రాథమికోన్నత 119,

ఉన్నత 120

మొదటి విడతలో ఎంపిక చేసిన పాఠశాలలు 179

మండలం ఎంపికై న

పాఠశాలలు

ఆదిలాబాద్‌రూరల్‌ 11

ఆదిలాబాద్‌ అర్బన్‌ 7

బజార్‌హత్నూర్‌ 7

బేల 7

భీంపూర్‌ 8

బోథ్‌ 15

గాదిగూడ 3

గుడిహత్నూర్‌ 11

ఇచ్చోడ 11

ఇంద్రవెల్లి 10

జైనథ్‌ 18

మావల 2

నార్నూర్‌ 6

నేరడిగొండ 7

సిరికొండ 3

తలమడుగు 13

తాంసి 8

ఉట్నూర్‌ 12

179 పాఠశాలలు ఎంపికయ్యాయి..

ప్రభుత్వం జిల్లాలోని 179 పాఠశాలలకు సోలార్‌ ప్యానళ్లు ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో సర్కారు బడులకు మేలు జరగనుంది. పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ వీటి నిర్వహణ చేపట్టనుంది. వీటిని పకడ్బందీగా ఏర్పాటు చేసేలా చర్యలు చేపడతాం. కొన్ని పాఠశాలల్లో ఇదివరకు పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద ఏర్పాటు చేశారు. అది విజయవంతంగా కొనసాగుతున్నాయి. – రాజేశ్వర్‌, డీఈవో

మండలాల వారీగా..

Advertisement
 
Advertisement
Advertisement