మరో ఎకరం పెట్టుబడి సాయం రూ.6వేల చొప్పున ఖాతాల్లో జమ మొదటి విడతలో లక్ష 63వేల మందికి రెండో విడతలో లక్ష 52వేల మందికి..
ఆదిలాబాద్‌టౌన్: రెండో విడత రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తుపూర్‌పల్లిలో నిర్వహించే బహిరంగ సభలో విడుదల చేయనున్నారు. మొదటి విడత రైతు భరోసా నిధులు మార్చి 23న రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఇందులో ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ పట్టా ఉన్న ప్రతీ రైతుకు ఒక ఎకరం డబ్బులు మాత్రమే జమ చేశారు. ఈ విడతలో మరో ఎకరానికి సంబంధించి నిధులు విడుదల కానున్నాయి. ఈ సారి జిల్లాలో లక్ష 52వేల మందికి ప్రయోజనం చేకూరనుంది. మూడో విడత డబ్బులు త్వరలోనే విడుదల అవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎకరం పైబడి, రెండెకరాల వరకు ఉన్న రైతులకు ఈ విడతలో జమ కానున్నాయి. గతంలో విడతల వారీగా డబ్బులు జమ అయ్యేవి. ఎకరం, ఆ తర్వాత రెండెకరాలు ఇలా వేసేవారు. దీంతో ఎకరం పైబడిన రైతులు తమకు ఎప్పుడు డబ్బులు జమ అవుతాయని ఎదురుచూసేవారు. ఈసారి మాత్రం ప్రతీ రైతుకు విడతల వారీగా డబ్బులు జమ చేస్తున్నారు. కాగా సోమవారం జిల్లాలోని రైతు వేదికల్లో సీఎం ప్రసంగాన్ని వీక్షించేందుకు వ్యవసాయ అధికారులు ఏర్పాట్లు చేశారు. రైతులు, వ్యవసాయ అధికారులు పాల్గొనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.


