ఇచ్చోడ: బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో ఆదివారం జాగృతిలో చేరారు. బాపూరావ్ 2009 ఎన్నికల సమయంలో ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేశారు. బోథ్ నుంచి టీఆర్‌ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. 2014లో టీఆర్‌ఎస్ టికెట్ దక్కగా మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2018లో రెండోసారి కారు గుర్తుపై పోటీ చేసి గెలుపొందారు. 2023 ఎన్నికల్లో గులాబీ బాస్ ఆయనకు టికెట్ నిరాకరించడంతో వెంటనే బీజేపీ చేరారు. అక్కడ కూడా నిరాశే ఎదురైంది. రెండో రోజే కాంగ్రెస్‌లో చేరారు. అక్కడ కూడా టికెట్ దక్కకపోగా నిరాశకు గురైన ఆయన ఇప్పటి వరకు ‘హస్తం’ పార్టీలోనే కొనసాగారు. క్రియాశీల రాజకీయాలకు మాత్రం దూరంగా ఉన్నారు. తాజాగా కవిత ఈనెల 25న కొత్త పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్‌ను వీడి జాగృతి కండువా కప్పుకున్నారు.


