భూ బదలాయింపు సులువేనా .. | - | Sakshi
Sakshi News home page

భూ బదలాయింపు సులువేనా ..

Apr 19 2026 7:29 AM | Updated on Apr 19 2026 7:29 AM

జాయింట్‌ యూజర్‌ ఎయిర్‌ఫీల్డ్‌ ఏర్పాటుకు 1500 ఎకరాలు అవసరం

రక్షణ శాఖ నుంచే మాస్టర్‌ ప్లాన్‌ ఉంటుందనే ప్రచారం

భూసేకరణ వ్యయంపై తొలగని సందిగ్ధం

తర్వాతి సమావేశంలో రానున్న స్పష్టత

సాక్షి, ఆదిలాబాద్‌: రక్షణ, పౌర విమానయాన శాఖలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఆదిలాబాద్‌లో విమానాశ్రయం కోసం నిర్వహించిన అబస్టకిల్‌ లిమిటేషన్‌ సర్పేసెస్‌ (ఓఎల్‌ఎస్‌) సర్వే తర్వాత ప్లాన్‌–బి తెరపైకి వచ్చిందనే ప్రచారం మొదలైంది. ఇందు కోసం 1500 ఎకరాల భూమి అవసరమని అంటున్నారు. ఈ భూసేకరణ వ్యయాన్ని పూర్తిగా రక్షణ శాఖే భరిస్తుందా.. లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం సహకారం తీసుకుంటుందా.. ఇలా భిన్న రకాలుగా చర్చించుకుంటున్నారు. రక్షణశాఖ నుంచే ఈ మాస్టర్‌ప్లాన్‌ అమలవుతుందనే ప్రచారం లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్‌లో జాయింట్‌ ఎయిర్‌ఫీల్డ్‌ ఏర్పాటును రక్షణశాఖ కీలకంగా తీసుకుంటుందా.. అని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సర్వేకు సంబంధించి ఫీల్డ్‌ ఇన్‌స్పెక్షన్‌ రిపోర్టును ఆయా శాఖలు ఆయా హెచ్‌వోడీలకు సబ్మిట్‌ చేసిన తర్వాత ఆ నివేదకల ఆధారంగా ఢిల్లీలో 20రోజుల్లో తదుపరి సమావేశం ఉంటుందని చెబుతున్నారు. దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వకపోయినప్పటికీ ఓఎల్‌ఎస్‌ సర్వే చేస్తున్న క్రమంలో ఈ అంశాలన్నీ వారు జిల్లా ప్రజాప్రతినిధులను, అధికారులను అడిగినట్లుగా తెలుస్తుంది.

ప్లాన్‌– ఏలో ఏముంది..

రక్షణశాఖకు సంబంధించి జిల్లా కేంద్రంలో 369 ఎకరాలు అందుబాటులో ఉందని, ఎయిర్‌పోర్టు ఏర్పాటు కోసం మరో 430కిపైగా ఎకరాలు అవసరమని ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, రాంమోహన్‌నాయుడు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాగా అంతకు ముందే ఈ 700 ఎకరాలకు పైగా భూమి సేకరణ కోసం గతేడాది నవంబర్‌ 3న ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ భూ సేకరణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని కేంద్ర మంత్రులు స్పష్టం చేశారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సంసిద్ధత వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. దీంతో ఈ ప్లాన్‌ ప్రకారమే భూ సేకరణ ఉంటుందని ఓఎల్‌ఎస్‌ సర్వే నిర్వహణకు ముందు ప్రచారం సాగింది.

భూ సేకరణ నిధుల వెచ్చింపులోనే ..

ప్లాన్‌–బిలో రక్షణ, పౌర విమానయానశాఖలు, రాష్ట్ర ప్రభుత్వం మూడు కలిసి ముందుకు వెళ్తాయా..అలాంటి పరిస్థితిలో భూ సేకరణను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తారా.. 1500 ఎకరాలు సేకరించాల్సి ఉండటంతో పెద్ద మొత్తం రాష్ట్రం భరించేందుకు సిద్ధమవుతుందా అనే చర్చ ప్రస్తుతం సాగుతుంది. అలా కాకుండా ఈ ఎయిర్‌ఫీల్డ్‌ను రక్షణ శాఖ కీలకంగా పరిగణిస్తుండటం, వైమానిక శిక్షణ కేంద్రంతో పాటు ఇక్కడ యుద్ధ విమానాలను నిలిపేందుకు అనువుగా ప్రత్యామ్నాయ స్థలంగా పరిగణిస్తుందనే ప్రచారం కూడా సాగుతుంది. అటువంటి పరిస్థితుల్లో రక్షణ శాఖ రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండానే భూసేకరణ వ్యయం పూర్తిగా భరించి ముందుకు వెళ్లవచ్చనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడే అవకాశం ఉండదని చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ జాయింట్‌ ఎయిర్‌ఫీల్డ్‌ ఏర్పాటు విషయంపై అందరి ఆసక్తి నెలకొంది.

కొత్త ప్లాన్‌ ప్రకారం 1500 ఎకరాల భూమి సేకరించాల్సి వస్తే.. అందులో సీసీఐ దగ్గర ఉన్న 800 ఎకరాలను రక్షణశాఖకు బదలాయించుకునే అవకాశం లేకపోలేదని ఇక్కడి ప్రజాప్రతినిధులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన సీసీఐ దశాబ్దాల క్రితం మూతపడటం, తాజాగా స్కారప్‌ కింద దాన్ని తొలగించే పనులకు సంబంఽధించి ప్రక్రియ మొదలైన నేపథ్యంలో ఈ భూముల బదలాయింపు అంశం కూడా చర్చలోకి వస్తుంది. అలాంటప్పుడు జాయింట్‌ ఎయిర్‌ఫీల్డ్‌ ఏర్పాటులో ప్రస్తుతం రక్షణశాఖ పరిధిలో ఉన్న 369 ఎకరాలు పోను సీసీఐ దగ్గరి 800కు అదనంగా మిగిలిన భూమి ప్రభుత్వాలు భూ సేకరణ చేయడం సులువుగా ఉంటుందనే అభిప్రాయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఢిల్లీలో జరిగే తదుపరి సమావేశంలోనే వీటన్నింటిపై స్పష్టత వచ్చే అవకాశముందని పేర్కొంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement