కై లాస్‌నగర్: రాజకీయ పార్టీలు, ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పరిషత్ ఎన్నికల నిర్వహణపై మళ్లీ కదలిక మొదలైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు వీలుగా ఓటరు జాబితాలు సిద్ధం చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సీఈసీ ఇటీవల ప్రకటించిన అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు జాబితా అనుసరించి అదనంగా నమోదైన ఓటర్ల ప్రకారం వార్డులు, పోలింగ్ కేంద్రాల వారీగా మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించింది. ఈమేరకు ఆశావహుల్లో ఆశలు చిగురించాయి. ఎస్‌ఈసీ ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీరాజ్ అధికారులు ఆ దిశగా కసరత్తు ప్రారంభించారు. గతంలోనూ ఈ ప్రక్రియ చేపట్టినా ఎన్నికలు నిర్వహించలేదు. ఈ సారైనా నిర్వహిస్తారా లేక మళ్లీ ఓటరు జాబితా తయారీతోనే సరిపెడుతారా అనేది చర్చనీయాంశంగా మారింది.
‘అసెంబ్లీ’ జాబితా ఆధారంగా..
కేంద్ర ఎన్నికల సంఘం గతేడాది జూలై 10 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 5వరకు చేపట్టిన ఓటర్ల సవరణ ప్రక్రియకు అనుగుణంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేసింది. దీంతో కొత్త ఓటర్లు స్పల్పంగా పెరిగారు. పంచాయతీ ఎన్నికల సమయంలో ప్రకటించిన తుది జాబితా ప్రకారం జిల్లాలో 4,49,981 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 2,19,652 మంది, మహిళలు 2,30,313 మంది ఉన్నారు. ఇతరులు మరో 16 మంది ఉన్నారు. ఇటీవల సవరణ ప్రక్రియ చేపట్టగా జిల్లాలో కొత్త ఓటర్లుగా 3,214 మంది నమోదయ్యారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 1,431, బోథ్ నియోజకవర్గంలో 1243, ఖానాపూర్ నియోజకవర్గంలోని ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాల పరిధిలో 330, ఆసిఫాబాద్ నియోజకవర్గ పరిధిలోని గాదిగూడ, నార్నూర్ మండలాల పరిధిలో 210 చొప్పున కొత్త ఓటర్లు నమోదయ్యారు. ప్రస్తుతం వీరందరిని వార్డులు, పోలింగ్ కేంద్రాల వారీగా మ్యాపింగ్ చేయనున్నారు.
కసరత్తు షురూ..
నూతన ఓటర్ల జాబితాలను అనుసరించి మండలాల వారీగా సిద్ధం చేయాలని జెడ్పీ సీఈవో, జిల్లా పంచాయతీ అధికారులను ఎస్‌ఈసీ ఆదేశించింది. తదనుగుణంగా వార్డులు, పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల వివరాలను మ్యాపింగ్ చేయాలని సూచించింది.ఎస్‌ఈసీ ఆదేశాల మేరకు జెడ్పీ సీఈఓ బి.రవి, జిల్లా పంచాయతీ అధికారి జి.రమేశ్ శనివారం జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు, జెడ్పీ సిబ్బందితో గూగుల్ మీట్ నిర్వహించారు. మ్యాపింగ్ ప్రక్రియకు అనుసరించాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈనెల 23 వరకు ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.
జిల్లాలో..
జెడ్పీటీసీ స్థానాలు 20
ఎంపీటీసీ స్థానాలు 166
మొత్తం పల్లె ఓటర్లు 4,49,981
కొత్తగా నమోదైన వారు 3214
ఓటర్ల మ్యాపింగ్
ప్రక్రియ గడువు ఈనెల 23
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఇక పరిషత్ ఎన్నికలను ప్రభుత్వం నిర్వహిస్తుందని రాజకీయ పార్టీలతో పాటు ఆశావహులంతా భావించారు. అయితే బీసీ రిజర్వేషన్ల అంశం కోర్టులో తేలాకే వాటిపై ముందుకెళతామని సీఎం ప్రకటించడంతో ఈ ప్రక్రియ వాయిదా పడింది. తాజాగా ఎస్‌ఈసీ ఓటర్ల జాబితాకు ఆదేశించడంతో ఎన్నికల అంశం మరోసారి తెరపైకి వచ్చినట్లయింది. అయితే వెంటనే చేపడుతుందా.. రిజర్వేషన్లు ప్రకటించాకే నిర్వహిస్తుందా అనేదానిపై మాత్రం అధికారికంగా ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అధికారులు మాత్రం ఎస్‌ఈసీ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.
చిగురించిన ఆశలు..


