కై లాస్‌నగర్: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 20నుంచి 26వరకు నిర్వహించనున్న సంక్షేమ వారోత్సవాలను విజయవంతం చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు హైదరాబాద్ నుంచి శనివారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో ఆయన సమీక్షించారు. సంక్షేమ వారోత్సవాలను పక్కాగా నిర్వహించేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఏప్రిల్ 20న జిల్లాలోని అన్ని సంక్షేమ హాస్టళ్లు, విద్యాసంస్థల్లో శానిటేషన్ డ్రైవ్ చేపట్టాలని సూచించారు. రెండోరోజు విద్యార్థులకు టాలెంట్ ఫెస్టివల్ పేరుతో క్విజ్, డిబేట్ వంటి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మూడో రోజున అన్ని సంక్షేమ వసతి గృహాలు, విద్యాసంస్థల్లో ఏమైనా మరమ్మతులు చేయాల్సి ఉంటే వాటిని పూర్తిచేయాలన్నారు. నాలుగో రోజున విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలకు ఆహ్వానించి ప్రభుత్వం విద్యార్థుల కోసం అమలు చేస్తున్న సౌకర్యాలను వివరించాలని తెలిపారు. తదుపరి రోజుల్లో విద్యార్థులకు స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు, సమ్మర్ క్యాంప్స్, బడిబాట తదితర కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఇందులో అదనపు కలెక్టర్ ఆర్‌ఎస్ చిత్రు, సంక్షేమ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


