ఆదిలాబాద్‌టౌన్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కించపరుస్తూ విద్వేష రాజకీయాలకు దారి తీసేలా బీజేపీ వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఆరోపించారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంట్‌లో తెలంగాణపై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా, మహిళా బిల్లుపై బీజేపీ చిత్తశుద్ధి లేని తీరును ఎండగడుతూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో శనివారం ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని కుమురం భీం చౌక్‌లో ప్లకార్డులతో నిరసన తెలిపారు. పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. ఎంపీ తేజస్వి చిత్రపటాన్ని దహ నం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ, పార్లమెంట్‌లో తెలంగాణకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు 16 మంది ఉన్నప్పటికీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలను ఒక్కరు కూడా ఖండించకపోవడం శోచనీయమన్నారు. మహిళా బిల్లుపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదని, దానిని నియోజక వర్గాల పూనర్విభజనను లింకు పెట్టడం సరికాదన్నారు. మహిళలందరికీ బీజేపీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు అజయ్, నారాయణ, రమేశ్, యూనిస్ అక్బా నీ, సాజిదొద్దీన్, ప్రహ్లాద్, రమేశ్, వసంత్, గణేశ్, భూమన్న, ప్రేమల, పర్వీన్, కరుణ, ఉమ తదితరులు పాల్గొన్నారు.


