కై లాస్‌నగర్: పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదు ట ఆందోళన చేపట్టారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి సర్కారు తీరుపై నిరసన వ్యక్తం చేశారు. జేఏసీ కన్వీనర్ కె.శివకుమార్, కోకన్వీనర్ ఏ.నవీన్ కుమార్ మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యలను ఆరు నెలల్లోపు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదన్నారు. ఫలితంగా ఉద్యోగ విరమణ పొందిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పీఆర్‌సీ గడువు ముగిసినప్పటికీ అమలుపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవో స్రవంతిని కలిసి డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జేఏసీ సభ్యులు సోగాల సుదర్శన్, కొమ్ము కృష్ణకుమార్, కిష్టన్న, అశోక్, సతీష్, రవీంద్ర, జలందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


