బకాయిల గండం! | - | Sakshi
Sakshi News home page

బకాయిల గండం!

Apr 17 2026 11:08 AM | Updated on Apr 17 2026 11:08 AM

నామమాత్రంగా ఆస్తిపన్ను వసూలు పేరుకుపోయిన రూ.22.56 కోట్లు ఏళ్లుగా చెల్లించని ప్రభుత్వ శాఖలు నోటీసులతోనే సరిపెడుతున్న వైనం మున్సిపాలిటీ అభివృద్ధికి అవరోధం

కైలాస్‌నగర్‌: ఆదిలాబాద్‌ పట్టణాభివృద్ధికి ఆస్తిప న్ను అత్యంత కీలకంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాల నుంచి ఇటీవల నిధుల విడుదల పూర్తిస్థాయిలో లేక ఇదే ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఇలాంటి ఆస్తిపన్ను చెల్లించకపోవడంతో ప్ర భు త్వ శాఖలకు సంబంధించి బకాయిలు పేరుకుపోయాయి. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్నుల వసూళ్లు గత మార్చి 31తో ముగి శాయి. ఒకటి, రెండు ప్రభుత్వ శాఖలను మినహా యిస్తే అత్యధిక శాఖలు పన్ను చెల్లించడంలో విఫలమయ్యాయి. అక్షరాలరూ.22కోట్ల 56లక్షల 92వేల 400 చెల్లించాల్సి ఉంది. పన్నులు వసూలు చేయాల్సిన అధికారులు నోటీస్‌లతోనే సరిపెడుతున్నారు.

668 ఆస్తులు.. బకాయిలు రూ.22కోట్లు

ఆదిలాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో 40 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 668 ఆస్తులున్నాయి. వీటికి సంబంధించి రూ.22.56 కోట్ల ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంది. పాత బకాయిలు రూ.9,34,27,324 ఉండగా ఏళ్ల తరబడి పన్ను చెల్లించకపోవడంతో వడ్డీ పడుతూ వస్తోంది. బకాయిల కంటే వడ్డీయే ఎక్కువగా ఉంది. రూ.12,18,55,784 వడ్డీ చెల్లించాల్సి ఉంది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.98,19,774 బకాయిలు ఉండగా వీటి వడ్డీ రూ.5,89,518 చెల్లించాలి. బకాయిలు, వడ్డీ కలిపి బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోయాయి. ఇందులో అత్యధికంగా సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండి యా (సీసీఐ)కి 326 ఆస్తులుండగా వీటి బకాయిలు రూ.4,80,81,474 బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఆర్‌అండ్‌బీ శాఖకు సంబంధించి 57 ఆస్తులు ఉండగా రూ.1,12,13,237 పన్ను చెల్లించాలి. ఈ రెండు శాఖలే కాదు.. జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ శాఖలు పన్నులను ఏళ్లుగా చెల్లించడం లేదు.

మార్చిలోనే హడావుడి

ప్రభుత్వ శాఖల నుంచి ఆస్తి పన్ను రెగ్యులర్‌గా వసూలు చేయాల్సిన బల్దియా అధికారులు ఆ దిశగా దృష్టి సారించడం లేదు. ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో కొంత హడావుడి చేస్తున్నారు. పన్ను చెల్లించాలని కోరుతూ నోటీస్‌లకే పరిమితమవుతున్నారు. ప్రభుత్వ శాఖలు స్పందించి స్వచ్ఛందంగా పన్ను చెల్లించేందుకు ముందుకు వస్తే తీసుకుంటున్నారు. లేదంటే మిన్నకుండి పోతున్నారు. దీంతో ఏళ్ల తరబడి బకాయిలు వసూళ్లకు నోచుకోవడం లేదు. బకాయిలు బల్దియా ఆదాయానికి గుదిబండాల మారి అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పలు శాఖల బకాయిలు రూ.లక్షల్లో ఉండటం గమనార్హం.

జిల్లా కేంద్రంలోని తుక్కు కింద విక్రయానికి సిద్ధమవుతున్న సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా రూ.4.83 కోట్ల ఆస్తిపన్ను చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం ఫ్యాక్టరీ ఆనవాళ్లు కోల్పోతున్న పరిస్థితుల్లో బకాయిలు వసూలయ్యే పరిస్థితి అనుమానంగానే ఉంది.

ప్రధాన శాఖల ఆస్తిపన్ను బకాయిల వివరాలు

ప్రభుత్వ శాఖ బకాయిలు

కలెక్టరేట్‌ రూ.2.73 కోట్లు

రైల్వే రూ.1.38 కోట్లు

ఆర్‌అండ్‌బీ రూ.1.14 కోట్లు

సోషల్‌ వెల్ఫేర్‌ రూ.95.83 లక్షలు

డీఎంహెచ్‌వో ఆఫీస్‌ రూ.59.24 లక్షలు

జెడ్పీ కార్యాలయం రూ.75.92 లక్షలు

పోస్టాఫీస్‌ రూ.66.65 లక్షలు

జిల్లా పరిశ్రమల కేంద్రం రూ.61.21 లక్షలు

ఎంపీడీవో ఆఫీస్‌ రూ.89.91 లక్షలు

విజయ డెయిరీ ఆఫీస్‌ రూ.43.14 లక్షలు

జిల్లా జైలు రూ.32.32 లక్షలు

జిల్లా క్రీడాశాఖ ఆఫీస్‌ రూ.32.17 లక్షలు

పీడబ్ల్యూడీ ఆర్‌అండ్‌బీ రూ.29.29 లక్షలు

డీపీవో ఆఫీస్‌ రూ.28.92 లక్షలు

రవాణాశాఖ కార్యాలయం రూ.26.57 లక్షలు

జిల్లా అటవీశాఖ రూ.25.92 లక్షలు

మార్కెట్‌ యార్డు రూ.12.76 లక్షలు

నోటీసులు జారీ చేశాం

పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్ను బకాయిలు చెల్లించాలని ప్రతీ ప్రభుత్వశాఖ ఉన్నతాధికారికి మార్చిలో నోటీసులు జారీ చేశాం. బీఎస్‌ఎన్‌ఎల్‌, పోలీస్‌ శాఖ, ఆర్టీసీ సంస్థలు మాత్రమే స్పందించి పన్నులు చెల్లించాయి. మిగతా శాఖలు నిధుల కొరత ఉందంటూ చెల్లించడం లేదు. దీంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లగా గత నెలలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి పన్నులు చెల్లించాలని ఆదేశించారు. అయినప్పటికీ బకాయిదారుల నుంచి స్పందన లేదు. బకాయిలు చెల్లించి బల్దియా అభివృద్ధికి సహకరించాలి.

– కళ్యాణ్‌, బల్దియా రెవెన్యూ అధికారి

Advertisement
 
Advertisement
Advertisement