కై లాస్‌నగర్: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని, నిబంధనలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ ఎస్.రాజేశ్వర్ సూచించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ, రవాణా, పోలీస్, మున్సిపల్, ఆర్‌అండ్‌బీ శాఖల అధికారులతో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో వాహనాల సంఖ్య పెరుగుతున్నందున ప్రమాదాలను నివారించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించి, సూచిక బోర్డులు, హెచ్చరిక లైట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. రహదారుల పక్కనున్న ఆక్రమణలను తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు. ముఖ్యంగా యువతకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనాలు నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్ వినియోగం మానుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన కారణంగా జరిగిన ప్రమాదాలపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించి విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) ఆర్‌ఎస్ చిత్రు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.


