సీసీఐ.. ఆశలు అవిరి! | - | Sakshi
Sakshi News home page

సీసీఐ.. ఆశలు అవిరి!

Apr 16 2026 12:47 PM | Updated on Apr 16 2026 12:47 PM

తుక్కుగా సిమెంట్‌ పరిశ్రమ రూ.50 కోట్లతో స్క్రాప్‌ టెండర్‌ ఖరారు తొలగింపు పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్‌ ఫ్యాక్టరీ ఇక చరిత్ర పుటల్లోకేనా..

కై లాస్‌నగర్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అభివృద్ధికి తలమానికంగా నిలిచిన ఆదిలాబాద్‌ సిమెంట్‌ కా ర్పొరేషన్‌ ఇండియా (సీసీఐ) ఫ్యాక్టరీ శకం ముగిసినట్లే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎప్పటికై నా పునః ప్రారంభం కాకపోతుందా అని ఎదురుచూసిన వారికి నిరాశే కనిపిస్తోంది. ఇటీవలే ఫ్యాక్టరీ పునః ప్రారంభంపై కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి డీపీఆర్‌ సిద్ధం చేయాలని ఆదేశించారు. దీంతో పునరుద్ధరణపై ఆశలు చిగురించాయి. అయితే కేంద్రం తాజాగా ఫ్యాక్టరీని తుక్కుగా విక్రయించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి టెండర్‌ దక్కించుకున్న ఢిల్లీకి చెందిన ఓ సంస్థ పరిశ్రమలో తుప్పు పట్టిన యంత్రాలను తొలగించే పనులు చేపట్టడం ఆందోళన కలిగిస్తోంది. మరికొన్ని రోజుల్లో తొలగింపు ప్రక్రియ పూర్తయి చరిత్రపుటల్లో నిలిచిపోనుంది. అయితే నాడు ఫ్యాక్టరీకి స్థలాన్ని ఇచ్చిన రైతులకు భూమిని తిరిగి కేటాయిస్తారా లేక విక్రయానికి పెడతారా అనే దానిపై సందిగ్ధత నెలకొంది.

1984లో ప్రారంభం..

ఆదిలాబాద్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నో లాస్‌..నో ప్రాపిట్‌ కింద దేశవ్యాప్తంగా సొంత సిమెంట్‌ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలని 1965లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీపీఐ)ను జిల్లా కేంద్రంలోని తిర్పెల్లి సమీపంలో ఏర్పాటు చేసింది. 1969లో మంజూరు కాగా 1984 మేలో నాటి సీఎం ఎన్టీఆర్‌, కేంద్రమంత్రి ఎన్డీ తివారీలు దీన్ని ప్రారంభించారు. రూ.47కోట్ల పెట్టుబడితో మూడు వేల మంది ఉద్యోగులతో ప్రారంభమైన ఫ్యాక్టరీ నెలలో రూ.3కోట్ల టర్నోవర్‌ సాధించి రికార్డు సృష్టించింది.1989 వరకు లాభాల బాటలోనే నడించింది. రోజూ 1200 టన్నుల మేర సిమెంట్‌ ఉత్పత్తి చేసింది. కేంద్రమే లెవీ కింద కొనుగోలు చేసి ప్రభుత్వ సంస్థలకు పంపిణీ చేసేది. 1991లో ప్రభుత్వ నూతన ఆర్థిక విధానాల మేరకు ఈ ఫ్యాక్టరీ నుంచి లెవీ సిమెంటు కొనుగోలును రద్దు చేసింది. ఆర్థిక ప్రోత్సాహకాలను కూడా నిలిపివేసింది. దీంతో బహిరంగ మార్కెట్‌లో సిమెంట్‌ విక్రయానికి టెండర్లలో పాల్గొన్నప్పటికీ ప్రైవేటు పరిశ్రమల పోటీని తట్టుకోలేక చతికిలపడింది. చివరికి సిమెంట్‌ నిల్వలు భారీగా పెరిగి నష్టాలు మొదలయ్యాయి. దీంతో ప్రభుత్వం 1996లో పారిశ్రామిక, ఆర్థిక పునర్నిర్మాణ మండలి (బీఐఎఫ్‌ఆర్‌)కి అప్పగించింది. ఈ యూనిట్‌కు ఆర్థిక పరిపుష్టి కలిగించాలని బీఐఎఫ్‌ఆర్‌ సూచించినా కేంద్రం స్పందించలేదు. దీంతో ఆదిలాబాద్‌ యూనిట్‌ను మూసివేయాలని సీసీఐ నిర్ణయించింది. ఎలాగోలా ఆరేళ్లు నెట్టుకుంటూ వచ్చిన సీసీఐ 2008లో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. అప్పుడు మూతపడ్డ పరిశ్రమ తెరచుకోలేదు.

తుక్కుగా మారనున్న పరిశ్రమ

1,500 మందికి ప్రత్యక్షంగా.. మరో 3వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించిన ఈ ఫ్యాక్టరీ తుక్కుగా మారనుంది. ఈ పరిశ్రమకు 30 ఏళ్ల నిర్వహణకు అవసరమైన సున్నపురాయి నిక్షేపాలతో పాటు 750 ఎకరాల సొంత భూమి, మరో 2వేల ఎకరాల వరకు లీజు భూములున్నాయి. 120 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఫ్యాక్టరీని తుక్కుగా విక్రయించాలని కేంద్రం భావించింది. ఇందులోని యంత్రాలన్నీ తుప్పుపట్టాయి. భవనాలు శిథిలావస్థకు చేరాయి. ఈ క్రమంలో పనికిరాని వాహనాలు, ఇతర సామగ్రిని తుక్కుకింద విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. 71యంత్రాలు, ఇతర భవనాల సామగ్రి అమ్మేందుకోసం రూ.50 కోట్లతో టెండర్లు పిలిచారు. గతేడాది మార్చిలోనే ఈ ప్రక్రియ చేపట్టగా కార్మికులు, ప్రతిపక్ష పార్టీల ఆందోళనతో నిలిచిచిపోయింది. తాజాగా యంత్రాలను స్క్రాప్‌గా మార్చి విక్రయిచేందుకు ఢిల్లీకి చెందిన హెచ్‌ఆర్‌ సంస్థ టెండర్‌ దక్కించుకుంది. ఇక్కడికి చేరుకుని యంత్రాలను స్క్రాప్‌గా మార్చేందుకు సన్నద్ధమైంది. ఈ చర్యలతో సీసీఐ పునఃప్రారంభంపై నెలకొన్న ఆశలు ఆవిరైపోయాయి.

తదుపరి చర్యలేంటో..

సీసీఐని పునరుద్ధరించాలని కొన్నేళ్లుగా కార్మిక సంఘాలతో పాటు ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌ చేస్తూ వ స్తున్నాయి. తమను గెలిపిస్తే పునరుద్ధరించేలా చూ స్తామని ఎంపీ, ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వారిద్ద రూ బీజేపీకి చెందిన వారే కావడంతో పునరుద్ధరణ పై ఆశలు చిగురించాయి. అయితే కేంద్ర తాజా నిర్ణయంపై కార్మికవర్గంలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

జిల్లా కేంద్రంలోని సీసీఐ పరిశ్రమ

పునఃప్రారంభ డీపీఆర్‌కు ఆదేశించినా ...

స్క్రాప్‌ మాత్రమే తొలగింపు

ఆదిలాబాద్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ 80 ఏళ్ల కిందటి మోడల్‌ది. స్వాతంత్య్రానికి ముందటి టెక్నాలజీతో కూడిన పరిశ్రమ కావడంతో అందులోని స్క్రాప్‌ మాత్రమే తొలగించాలని కేంద్రం నిర్ణయించింది. దాన్ని తొలగించాకే కేంద్రం పరిధిలో పరిశ్రమను ప్రారంభించాలా, లేక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలా, లేక పీపీపీ మోడల్‌లో పునరుద్ధరించాలా అనేదానిపై నిర్ణయించాల్సి ఉంటుంది. ఫ్యాక్టరీలోని స్క్రాప్‌ తొలగింపు పరిశ్రమ పునరుద్ధరణకు ముందడుగు లాంటింది. కానీ ప్రతిపక్షపార్టీలు , కార్మిక సంఘాలు దీన్ని అర్థం చేసుకోకుండా అసత్య ప్రచారం చేయడం సరికాదు. ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం కట్టుబడి ఉన్నాం. కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ప్రారంభించేలా చూస్తాం. తప్పుడు ప్రచారం మానుకోవాలి.

–పాయల్‌ శంకర్‌, ఎమ్మెల్యే, ఆదిలాబాద్‌

ఫ్యాక్టరీ పునరుద్ధరణ సాధ్యాసాధ్యాలపై కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి గతేడాది సెప్టెంబర్‌లో శాఖ అధికారులతో ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. మంత్రి ఆదేశాల మేరకు సీసీఐ సీఎండీ సంజయ్‌ బంగా రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌తో కలిసి అదే నెల 8న హైదరాబాద్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. పరిశ్రమ పునరుద్ధరణకు అందుబాటులో ఉన్న వనరులు, చేకూరే ఉపాధి వంటి అంశాలపై చర్చించారు. డీపీఆర్‌ సిద్ధం చేయాలని అధికారులను ఆదేఽశించడంతో పునరుద్ధరణపై ఆశలు చిగురించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా ఉండటంతో తిరిగి ప్రారంభం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ క్రమంలోనే ఫ్యాక్టరీలోని యంత్రాలను విక్రయించే ప్రక్రియ మొదలవడంతో పునరుద్ధరణ అటకెక్కిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

‘సీసీఐ దొంగచాటు పనులపై సమాధానం చెప్పాలి’

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లా కేంద్రంలోని సీసీఐ పరిశ్రమలో జరుగుతున్న దొంగచాటు పనులపై ఎంపీ, ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలని సీసీఐ సాధన కమిటీ కోకన్వీనర్‌ ఇజ్జగిరి నారాయణ అన్నారు. బుధవారం ఫ్యాక్టరీ వద్ద క్వార్టర్స్‌లో జరుగుతున్న పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేలు తాము గెలిస్తే సీసీఐని పునఃప్రారంభిస్తారని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఫ్యాక్టరీని పునరుద్ధరించేంత వరకు సాధన కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఇందులో సాధన కమిటీ నాయకులు బండి దత్తాత్రి తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement