ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటు దిశగా ముందడుగు | - | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటు దిశగా ముందడుగు

Apr 16 2026 12:47 PM | Updated on Apr 16 2026 12:47 PM

● మంత్రి పొన్నం, ఎమ్మెల్యే పాయల్‌ ఏరియల్‌ సర్వే

ఆదిలాబాద్‌: జిల్లాలో ప్రతిపాదిత విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ వికాస్‌రాజ్‌, ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ బుధవారం ప్రతిపాదిత ఎయిర్‌పోర్ట్‌ స్థలాన్ని ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా చీఫ్‌ సెక్రటరీ వికాస్‌ రాజ్‌ మాట్లాడుతూ, ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి అవసరమైన సాంకేతిక అనుమతుల కోసం త్వరలోనే ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ద్వారా ఓఎల్‌ఎస్‌ (అబ్‌స్టాకిల్‌ లిమిటేషన్‌ సర్‌ ఫేసెస్‌) సర్వే నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక ఆసక్తితో ఉందని, ఎయిర్‌పోర్ట్‌ కోసం అవసరమైన 434 ఎకరాల భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. విమానాశ్రయాన్ని డిఫెన్స్‌, ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే శంకర్‌ మాట్లాడుతూ ఆదిలాబాద్‌ సమగ్ర అభివృద్ధికి ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటు అత్యంత కీలకమని, దీని కోసం కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందిస్తోందని పేర్కొన్నారు. విమానాశ్రయం అందుబాటులోకి రావడం వల్ల జిల్లాలో రవాణా సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వారి వెంట ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement