కుంటాల: మండలంలోని కల్లూరు గ్రామానికి చెందిన కానిస్టేబుల్ స్వప్న, పీఈటీ సంతోశ్‌రెడ్డి దంపతుల కుమార్తె రితిక జాతీయ స్థాయి రగ్బీ పోటీల్లో ప్రతిభ కనబరించింది. నవంబర్‌లో నిర్మల్ పట్టణంలో నిర్వహించిన జోనల్‌స్థాయి అండర్–14 పోటీల్లో సత్తాచాటింది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జనవరి 22 నుంచి 24 వరకు వరంగల్ జిల్లా డోర్నకల్‌లో నిర్వహించిన పోటీల్లో విజేతగా నిలిచింది. ఈనెల 8 నుంచి 11 వరకు ఒడిస్సా రాష్ట్రం భువనేశ్వర్ పట్టణంలోని కలింగ మైదానంలో నిర్వహించిన పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి నాలుగో స్థానంలో నిలిచింది.
నీలగిరి దుంగలు పట్టివేత
చెన్నూర్‌రూరల్: మండలంలోని బావురావుపేట గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి రెండు ఎడ్లబండ్లలో అక్రమంగా తరలిస్తున్న నీలగిరి దుంగలను పట్టుకున్నట్లు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ తెలిపారు. దుంగలను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం మేరకు సిబ్బందితో కలిసి వెళ్లి దాడి చేసి పట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. దుంగలు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ఎడ్లబండ్లను చెన్నూర్ ఫారెస్టు కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు.
మద్యం మత్తులో
ఒకరి ఆత్మహత్య
భైంసారూరల్: మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై సుప్రియ తెలిపిన వివరాల మేరకు మండలంలోని కామోల్ గ్రామానికి చెందిన జువేకర్ ఉత్తం (35) వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మంగళవారం రాత్రి మద్యం మత్తులో పురుగుల మందు తాగాడు. కొద్ది సేపటికి వాంతులు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు భైంసా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బుధవారం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


