నిర్మల్‌ఖిల్లా/కుంటాల: కుంటాల మండలంలోని పెంచికల్‌పహడ్ గ్రామానికి చెందిన కదం రూప, సంతోష్ దంపతుల కుమార్తె హారిక 2014 నుంచి 2019 వరకు అదే గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోనే ప్రాథమిక విద్య పూర్తి చేసింది. అనంతరం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు చదివింది. నిర్మల్‌లో ఇంటర్ బైపీసీ పూర్తి చేసింది. ఇటీవల వెలువడిన ఫలితాల్లో 995 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటింది. ఇదే గ్రామానికి చెందిన సూర్వే వసుంధర, గంగాధర్ దంపతుల కుమార్తె సూర్వే సారిక కూడా తన ప్రాథమిక విద్యను స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే 2014 నుంచి 2019 వరకు పూర్తి చేసింది. ఆదర్శ పాఠశాలలో పదో తరగతి వరకు అభ్యసించింది. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ పూర్తి చేసింది. ఇటీవల వెలువడిన ఫలితాల్లో 993 మార్కులు సాధించింది.


