తాంసి: భీంపూర్ మండలంలోని తాంసి(కె) శివారులో బుధవారం రెండున్నర ఎకరాల జొన్నపంట దగ్ధమైంది. గ్రామానికి చెందిన కరీం తనకున్న రెండున్నర ఎకరాల్లో జొన్నపంట సాగు చేశాడు. పక్కనున్న పంట చేనులో రైతులు వ్యర్ధాలను కాల్చివేసే క్రమంలో ఈదురు గాలులకు నిప్పురవ్వలు ఎగిరిపడి జొన్నచేనులో పడడంతో మంటలు వ్యాప్తి చెంది చేతికి అందివచ్చే దశలో ఉన్న జొన్నపంట పూర్తిగా దగ్ధమైంది. స్థానిక రైతులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా అదుపులోకి రాలేదు. పంట పెట్టుబడికి రూ.లక్షకు పైగా అప్పు చేసినట్లు రైతు తెలిపాడు. ఘటనలో రూ.5 లక్షల మేర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నాడు.
పెళ్లి చేయడం లేదని తండ్రిని చంపిన తనయుడు
కౌటాల: తనకు పెళ్లి చేయడంలేదని కుమారుడు తండ్రిని హతమార్చిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై డి.చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. కనికి గ్రామానికి చెందిన అవ్తారే లింబాజీ (69), పెంటుబాయి దంపతులకు ముగ్గురు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు కరీంనగర్‌లో, మూడో కుమారుడు కాళేశ్వరంలో పని చేస్తున్నారు. రెండో కుమారుడు కుశబ్‌రావు తల్లిదండ్రులతో పాటు ఇంటి వద్దనే ఉంటూ కూలీ పని చేస్తున్నాడు. మంగళవారం మద్యం సేవించి ఇంటికి వచ్చి తండ్రితో పెళ్లి విషయమై గొడవపడ్డాడు. ఈ క్రమంలో లింబాజీ కడుపులో పిడిగుద్దులు గుద్దాడు. తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు లింబాజీని మంచిర్యాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందించి బుధవారం ఇంటికి తీసుకొచ్చారు. కడుపులో అంతర్గత గాయాల కారణంగా సాయంత్రం ఇంటి వద్ద మృతి చెందాడు. మృతుని భార్య పెంటుబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని సిర్పూర్(టి) సామాజిక ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం గురువారం కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని ఎస్సై తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.


