మంచిర్యాలరూరల్(హాజీపూర్): తండ్రి చనిపోయిన రోజునే జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృతి చెందిన ఘటన హాజీపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని సీసీసీకి చెందిన సింగరేణి కార్మికుడు న్యాతరి రమేశ్(35) తండ్రి గట్టయ్య గతేడాది ఏప్రిల్ 15న మృతి చెందాడు. బుధవారం తండ్రి చనిపోయిన రోజు కావడంతో సొంత ఊరైన హాజీపూర్ మండలంలోని దొనబండకు వెళ్లాడు. కుటుంబ సభ్యులతో రోజంతా గడిపిన రమేశ్ తన భార్య రజిత, కుమారుడు ఆనందన్‌తో కలిసి రాత్రి ద్విచక్ర వాహనంపై సీసీసీకి బయలు దేరాడు. వేంపల్లి శివారులో ఎదురుగా వస్తున్న కారు వేగంగా ఢీ కొట్టడంతో రమేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. రజితకు కాలు విరగగా కుమారుడు ఆనందన్ స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.


