ఆదిలాబాద్‌రూరల్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే దేశ ప్రజలకు సమానత్వం వంటి హక్కులు లభించాయని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. అంబేడ్కర్ జయంతి వేడుకలను జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ చౌక్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూషతో కలిసి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, యువత ఆధునిక, సాంకేతిక రంగాల్లో రాణిస్తూ సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ బాధితులకు సత్వర న్యాయం అందించడమే పోలీసుల ప్ర ధాన లక్ష్యమని తెలిపారు. ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ దళితులు అన్ని రంగాల్లో మరింత ముందు కు సాగాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు బహుమతి ప్రదానంతో పాటు గ్రూప్–2లో విజయం సాధించిన అవినాష్‌ను సన్మానించారు. అనంతరం రహదారి భద్రతకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఇందులో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రవీంద్ర కుమార్, ఆదిలా బాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, డీటీవో శ్రీనివాస్, పట్ట ణ సీఐలు, ఎంవీఐలు, ఏఎంవీఐలు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అంబేడ్కర్ స్ఫూర్తితో ముందుకు..
సమానత్వం, సామాజిక న్యాయం కోసం అంబేడ్కర్ స్ఫూర్తికి కట్టుబడి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్ అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ మండలం భీంసరి గ్రామంలో డీసీసీ ఆధ్వర్యంలో ‘న్యాయ్ భోజ్’ నిర్వహించారు. ముందుగా గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా సమానత్వాన్ని చాటి చెప్పడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఇందులో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు సాజిద్ ఖాన్, సంజీవరెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.


