ఒకేసారి మూడు నెలల బియ్యం | - | Sakshi
Sakshi News home page

ఒకేసారి మూడు నెలల బియ్యం

Mar 28 2026 7:32 AM | Updated on Mar 28 2026 7:32 AM

● వేసవి ఎండల దృష్ట్యా కేంద్రం నిర్ణయం ● వచ్చే నెలలో ఏప్రిల్‌, మే, జూన్‌ కోటా పంపిణీ

బోథ్‌: పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతలు దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం రేషన్‌ లబ్ధిదారుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ప్రతినెల ఇచ్చే రేషన్‌ బియ్యంను ఈసారి మూడు నెలల కోటా కలిపి ఒకేసారి ఏప్రిల్‌లోనే పంపిణీ చేయాలని నిర్ణయించింది. మార్చి మొదటి వారం నుంచే ఎండలు మండిపోతుండటం, రానున్న ఏప్రిల్‌, మే నెలల్లో ఉష్ణోగ్రతలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో లబ్ధిదారులు ఎండలో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం కార్డులోని ఒక్కో సభ్యుడికి నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన కొత్త కార్డుల జారీ ప్రక్రియ, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేగవంతం కావడంతో రాష్ట్రంలో ఫుడ్‌ సెక్యూరిటీ కార్డుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పుడు కేంద్రం సూచనల మేరకు మూడు నెలల కోటా ఒకేసారి ఇవ్వడంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి రవాణా ఖర్చులు, డీలర్లకు హమాలీ కూలీ ఖర్చులు తగ్గే అవకాశం ఉంది.

నిల్వ సామర్థ్యమే అసలు సవాలు..

మూడు నెలల రేషన్‌ బియ్యం పంపిణీ ప్రక్రియలో కొన్ని క్షేత్రస్థాయి సమస్యలు కూడా ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో వర్షాకాలంలో ఇలాగే మూడు నెలల కోటా ఇచ్చినప్పుడు నిల్వ సామర్థ్యం లేక రేషన్‌ డీలర్లు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కూడా అంత పెద్ద మొత్తంలో బియ్యాన్ని భద్రపరచడం డీలర్లకు సవాలుగా మారింది. దీనికి తోడు దొడ్డు బియ్యం ఇప్పటికే డీలర్ల వద్ద నిల్వ ఉంది. మరోవైపు సాంకేతిక పరంగా ఒక్కో కార్డుకు మూడుసార్లు వేలిముద్రలు వేయాల్సి రావడం, సర్వర్‌ నెమ్మదించడం వంటి కారణాల వల్ల ఒక్కో లబ్ధిదారునికి 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతోంది. ఈ సాంకేతిక ఇబ్బందులను పరిష్కరిస్తేనే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఆశించిన స్థాయిలో లబ్ధిదారులకు చేరువవుతుంది.

జిల్లాలో రేషన్‌ దుకాణాలు: 492

రేషన్‌ దుకాణాలు : 2,26,048

యూనిట్లు : 7,40,622

మూడు నెలల కోటా: 14,100 మెట్రిక్‌ టన్నులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement