ఆదిలాబాద్: ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని జాతీయ రహదారులను విస్తరించాలని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. లోక్‌సభలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ, మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్ వరకు ఉన్న జాతీయ రహదారి–44ను ఆరు వరుసలకు విస్తరించాలని కోరారు. ఇది మహారాష్ట్రలోని వార్ధా, యావత్మాల్, తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, మల్కాజిగిరి మీదుగా వెళ్లే అత్యంత కీలకమైన మార్గమని పేర్కొన్నారు. గుడిహత్నూర్ నుంచి ఆసిఫాబాద్, అల్లపల్లి వరకు, అలాగే భోరజ్ నుంచి మాహూర్, మాండవి, కరంజి మీదుగా ఉన్న రహదారుల అభివృద్ధిని చేపట్టాలని కోరారు. అలాగే కళ్యాణ్ నుంచి నిర్మల్ వరకు ఉన్న జాతీయ రహదారి–63ని సైతం విస్తరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. గతంలో కేంద్ర మంత్రులు ఇచ్చిన హామీలు నెరవేర్చి ఆదిలాబాద్ ప్రాంత రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని విన్నవించారు.


