ఆదిలాబాద్: ఆదిలాబాద్‌ను గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు అందరూ కృషి చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. టూటౌన్ పోలీస్ స్టేష న్‌ను బుధవారం తనిఖీ చేశారు. కేసుల వివరాలు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. నేరాల ని యంత్రణలో, నిందితులను త్వరితగతిన పట్టుకోవడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయన్నా రు. ఈమేరకు ప్రతీ వార్డులో ప్రజలు స్వచ్ఛందంగా వాటిని ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎల్. జీవన్‌రెడ్డి, టూటౌన్ సీఐ కె.నాగరాజు, ఎస్సైలు పీర్‌సింగ్, అఖిల్, విష్ణు ప్రకాశ్, డీసీఆర్‌బీ ఎస్సై దివ్యభారతి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
అక్రమంగా పెట్రోల్ విక్రయిస్తే కఠిన చర్యలు
జిల్లాలో అక్రమంగా పెట్రోల్ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రకటనలో పేర్కొన్నారు. పెట్రోల్ కొరత ఉందంటూ వ స్తున్న పుకార్లను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని, తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. బహిరంగ విక్రయాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.
ఒకరిపై కేసు నమోదు..
మరోవైపు ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా బహిరంగంగా పెట్రోల్ విక్రయిస్తున్న ఫైజల్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలోని ఖాన్ బేకరీలో అధిక ధరలకు విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన 30 లీటర్ల పెట్రోల్‌ను, నిల్వ ఉంచిన డబ్బాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇచ్చోడ పోలీస్ స్టేషన్ తనిఖీ
ఇచ్చోడ: జిల్లాను గంజాయి రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఇచ్చోడ పోలీస్‌స్టేషన్‌ను బుధవారం తనిఖీ చేసి నమోదైన కేసుల పురోగతిని సమీక్షించారు. ఇందులో ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, ఇచ్చోడ సీఐ బండారి రాజు, ఎస్సై నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.


