కై లాస్‌నగర్: గ్రామాల్లో పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏటా వానాకాలంలో మొక్కలు నాటుతున్నారు. వన మహోత్సవంలో భాగంగా 2026–27 సంవత్సరానికి సంబంధించి లక్ష్యాన్ని ఆ శాఖ ఖరారు చేసింది. జిల్లా వ్యాప్తంగా 9లక్షల 83వేల మొక్కలు నాటేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఆయా పంచాయతీల్లో నర్సరీల్లో విత్తనాలు నాటేందుకు వీలుగా చర్యలు చేపట్టారు. బ్యాగుల్లో మట్టి నింపే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
గతేడాదితో పోల్చితే తగ్గిన లక్ష్యం
గ్రామ పంచాయతీలు, నాటాల్సిన మొక్కలకనుగుణంగా లక్ష్యాలను నిర్ణయించారు. అయితే గతేడాది పొల్చితే లక్ష్యాన్ని భారీగా తగ్గించారు. గతంలో ఒక్కో మండలానికి 3లక్షల వరకు నాటాలనే టార్గెట్ ఉండగా, ఈసారి 25వేల నుంచి లక్షకు తగ్గించారు. తదనుగుణంగా రానున్న జూన్, జూలై మాసాల్లో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటనున్నారు.
సిద్ధమవుతున్న నర్సరీలు
లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను సరఫరా చేసేందుకు వీలుగా ఆయా గ్రామాల్లో నర్సరీలను ఏర్పాటు చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 473 గ్రామపంచాయతీలు ఉండగా, 237 నర్సరీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే పలు నర్సరీల్లో సంచుల్లో మట్టి నింపే ప్రక్రియ కూడా పూర్తి చేశారు. వన మహోత్సవంలో భాగంగా వేప, మర్రి, రావి, చింతతో పాటు గులాబీ, మల్లె, మందార, చామంతి వంటి పూల మొక్కలు, జామ, సీతాఫలం, అల్లనేరేడు వంటి పండ్ల మొక్కలు అందించేలా ప్రణాళికను సిద్ధం చేశారు. కొన్నిచోట్ల విత్తనాలు నాటే ప్రక్రియ కూడా పూర్తి చేశారు. నర్సరీ పనులకు ఉపాధి హామీ పథకం కింద నిధులు చెల్లించనున్నారు.
లక్ష్యానికి అనుగుణంగా ఏర్పాట్లు..
రానున్న వార్షిక సంవత్సరానికి సంబంధించి 9లక్షల 83వేల మొక్కలు నాటేలా కార్యాచరణ సిద్ధం చేశాం. ఈ మేరకు జిల్లాలోని ఆయా గ్రామాల్లో 237 నర్సరీలను ఉపాధి హామీ పథకం కింద ఏర్పాటు చేశాం. ఇప్పటికే బ్యాగుల్లో మట్టి నింపే పనులు పూర్తయ్యాయి. లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.
– రాథోడ్ రవీదర్, డీఆర్డీవో


