‘హస్తం’ పార్టీలో సంస్కరణలు కొత్తగా జిల్లా పొలిటికల్ ఎఫైర్ కమిటీ సమష్టి నిర్ణయాలకు పెద్దపీట వేసేందుకు..
సాక్షి, ఆదిలాబాద్: కాంగ్రెస్‌లో సంస్థాగత ప్రక్షాళన మొదలైంది. ఇటీవల నూతన డీసీసీ అధ్యక్షులకు వికారాబాద్‌లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పేర్కొన్న విధంగా క్షేత్రస్థాయిలో పార్టీలో సమూల మార్పులకు సిద్ధమవుతోంది. రాష్ట్రస్థాయిలో పొలిటికల్ ఎఫైర్ కమిటీ ఉండగా, ప్రస్తుతం జిల్లా స్థాయిలోనూ ఏర్పాటుపై ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించిన ప్రక్రియ తాజాగా మొదలైంది.
రాహుల్‌గాంధీ సూచన మేరకు..
జిల్లాలో పలు నామినేటేడ్ పదవులు ఉన్నాయి. వాటిని పార్టీలో అంకితభావంతో పనిచేసే కార్యకర్తలకు ఇవ్వాలి. అలా కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు తాము సూచించిన వ్యక్తులకు ఆ పదవీని ఇవ్వ డం,ఆ విషయంలో ఇతర ముఖ్య నాయకులు వ్యతి రేకించినా చెల్లకపోవడం వంటివి సామాన్యంగా చూస్తాం. ఒక నామినేటెడ్ పదవుల విషయం అనే కాకుండా పార్టీలో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో సమష్టి నిర్ణయం కోసమే ఏర్పాటు చేస్తున్నది జిల్లా పొలిటికల్ ఎఫైర్ కమిటీ. సంఘటన్ సృజన్ అభియాన్‌లో భాగంగా ఇటీవల వికారాబాద్‌లో డీసీసీ అధ్యక్షులకు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ పాల్గొని పార్టీలో తీసుకువస్తున్న సంస్థాగత ప్రక్షాళన విషయంలో దిశానిర్దేశం చేశారు. తదనుగుణంగా పొలిటికల్ ఎఫైర్ కమిటీ అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తుండగా ఆదిలాబాద్‌లోనూ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.
ఈ కమిటీలో ఎవరెవరూ..
డీసీసీ అధ్యక్షుడు చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమి టీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు, మాజీ ప్రజాప్రతినిధులు ఉండనున్నారు. జిల్లాలో కమిటీ ఏర్పాటుకు సంబంధించి వివిధపేర్లతో అధిష్టానానికి ప్రతిపాదన పంపించినట్లు డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్ తెలి పా రు. పార్టీలో ఒకరి పెత్తనం కాకుండా ఏదైనా సమష్టిగా నిర్ణయం తీసుకుని అధిష్టానానికి తెలియజేయడం, దాని విషయంలో ఎలాంటి అభ్యంతరా లు తలెత్తకుండా చూడటమే ఈ కమిటీ ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పథ కాలను ప్రవేశపెట్టడం, అవి ప్రజల వరకు చేరుతున్నాయా లేదా అనే విషయంలో రాష్ట్రస్థాయిలో కో ఆర్డినేషన్ కమిటీ ఉన్నట్లుగానే జిల్లా స్థాయిలోనూ ఈ పొలిటికల్ ఎఫైర్ కమిటీ సమన్వయం చేసే విధంగా వ్యవహరిస్తుందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. రాహుల్ గాంధీ ఆలోచనల నుంచే వచ్చిందని అభిప్రాయపడుతున్నా రు. ఇదిలా ఉంటే ఇందులో సభ్యులుగా ఎవరెవ రూ ఉంటారనేది ప్రస్తుతం పార్టీలో ఆసక్తికరంగా మారింది.


