సీసీఐ కొనుగోళ్లు బంద్
ఇక ప్రైవేట్ వ్యాపారులే దిక్కు రైతుల వద్ద భారీగా పత్తి నిల్వలు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన దుస్థితి
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో శనివారం నుంచి సీసీఐ పత్తి కొనుగోళ్లు బంద్ కానున్నాయి. ఇక పత్తి రైతుల కు ప్రైవేట్ వ్యాపారులే దిక్కవనున్నారు. తక్కువ ధ రకు అమ్ముకొని నష్టపోవాల్సిన దుస్థితి. ఈ ఏడాది దిగుబడి తగ్గడంతో పాటు పంట ఆలస్యంగా చేతికొచ్చింది. ఏటా మార్చి వరకు కొనుగోలు చేసే సీసీఐ అధికారులు ఈసారి ముందుగానే కేంద్రాల ను మూసివేసేందుకు నిర్ణయించారు. అక్టోబర్ 24 న కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మొత్తం జిల్లాలో 15,74,066 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. గతేడాది 25లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయగా, ఈసారి అధిక వర్షాలతో దిగుబడి తగ్గింది.
ప్రైవేటే దిక్కు..
సీసీఐ కొనుగోలు కేంద్రాలు మూసివేయడంతో రైతులు ఇక ప్రైవేట్ వ్యాపారులనే ఆశ్రయించాల్సి వస్తోంది. మొదటి నుంచి సీసీఐ తేమ పేరిట కోతలు విధించి రైతులను ఇబ్బందులకు గురిచేసింది. మద్దతు ధర మొదట్లో రూ.8,110 ఉండగా, తేమ పేరిట కోత విధించడంతో చాలామందికి ఎంఎస్పీ లభించలేదు. దీంతో తక్కువ ధరకు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకొని నష్టపోవాల్సి వచ్చింది. అలాగే పంట నాణ్యత పేరిట రెండుసార్లు రూ.50 చొప్పున మద్దతు ధర తగ్గించి చివరకు క్వింటాలుకు రూ.8,010తో కొనుగోలు చేశారు. ప్రైవేట్ వ్యాపారులు అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తికి ధర తక్కువగా ఉందని రూ.7,200 నుంచి రూ.7,700 వరకు మాత్రమే కొంటున్నారు. వీరు కూడా తేమ పేరిట కోత విధించడంతో రైతులకు రూ.6,500 వరకే ధర లభించింది. జిల్లాలో ఇంకా రైతుల వద్ద దాదాపు 5లక్షల క్వింటాళ్ల వరకు పత్తి నిల్వ ఉండవచ్చని తెలుస్తోంది. ఈ విషయమై మార్కెటింగ్ ఏడీ గజానంద్‌ను వివరణ కోరగా, సీసీఐ శనివారం నుంచి పత్తి కొనుగోళ్లు చేయడం లేదని తెలిపారు. పంట నాణ్యత లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రైతులు కూడా మార్కెట్‌కు రావడం లేదని, ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేపడతారని వివరించారు.
‘పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలి’
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా రైతుల వద్ద నిలువ ఉన్న, లేట్ క్రాఫ్ ద్వారా సేకరిస్తున్న పత్తి చివరి పంటను కొనుగోలు చేయించడంలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు విఫలమయ్యారని బీఆర్‌ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు విజ్జగిరి నారాయణ ప్రకటనలో ఆరోపించారు. గడువు ముగిసిందని అధికారులు ప్రకటించడం, కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేద్దామంటే స్లాబ్ సిస్టమ్ నిలిపి వేయడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారని పేర్కొన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రైతుల పత్తిని చివరి వరకు కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు.


