కుళ్లిన చికెన్‌.. వేడివేడిగా సర్వ్‌! | - | Sakshi
Sakshi News home page

కుళ్లిన చికెన్‌.. వేడివేడిగా సర్వ్‌!

Apr 4 2026 7:37 AM | Updated on Apr 4 2026 7:37 AM

ప్రజారోగ్యంతో చెలగాటం హోటళ్లు, రెస్టారెంట్లలో అపరిశుభ్ర ఆహారం ఇటీవల తనిఖీల్లో బహిర్గతం జిల్లాలో పలు కేసులు నమోదు

ఆదిలాబాద్‌టౌన్‌: రోజుల తరబడి ఫ్రిజ్‌లో ఉంచిన చికెన్‌ను అప్పటికప్పుడు వేడి చేస్తున్నారు.. వాటికి మసాలాలు, నిషేధిత రంగులను జత చేసి ఘుమఘుమలాడేలా ప్లేట్‌లో సర్వ్‌ చేస్తున్నారు. లొట్టలేసి తిన్నారనుకో అంతే మరి. ఆస్పత్రి పాలవడం ఖాయం. జిల్లాలోని పలు హోటళ్లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు కుళ్లిన పదార్థాలను విక్రయిస్తూ ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. రోజుల తరబడి మాంసపు నిల్వలను ఫ్రిజ్‌లో నిల్వ ఉంచడం, నిషేధిత రంగు గల రసాయనాలు వాడటం, వాడిన నూనెనే మళ్లీ వినియోగించడంతో ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతోంది. జిగేల్‌మనే విద్యుత్‌ కాంతులు, అద్దాలు, గార్డెన్‌ను చూసి హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్తున్నారా.. అయితే అక్కడ కిచెన్లను చూస్తే మాత్రం విస్తుపోవాల్సిందే. పలుమార్లు తనిఖీలు చేసినప్పుడు బయటపడుతున్న డొల్లతనాన్ని వారు సరిచేసుకోలేక పోతున్నారు. నామ్‌కే వాస్తే జరిమానాతో వారు మరింతగా రెచ్చిపోతున్నారు.

కుళ్లిన పదార్థాలతో..

జిల్లాలోని చాలా హోటళ్లలో బిర్యానీ చేసిన తర్వాత మిగిలిపోతే అందులోని ముక్కలను తీసి మరుసటి రోజు వినియోగిస్తున్నారు. వాసన రాకుండా, సువాసన వెదజల్లేలా అందులో టెస్టింగ్‌ పౌడర్‌ వేస్తున్నారు. ఇలాంటి భోజనం తినేవారు క్యాన్సర్‌ బారిన పడే ప్రమాదం లేకపోలేదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీంతోపాటు స్వీట్‌లలో కూడా రసాయనాలు వాడుతున్నారు. మిఠాయిలతో సంతోషాలను పంచుకోవడాన్ని పక్కనబెడితే తినే వారి ఆరోగ్యం చెడిపోయే ప్రమాదం లేకపోలేదనే వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ ఆహార పదార్థాలకు వినియోగించే సరుకులు సైతం నాణ్యతగా లేకపోవడం గమనార్హం. గడువు తీరినవి, ఫ్రిజ్‌లో స్టోరేజ్‌ చేసి తర్వాత వాడుతుండడంతో ప్రజలు అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.

నిరంతరం తనిఖీలు చేస్తాం..

ప్రజారోగ్యంతో చెలగాటం ఆడే హోటాళ్ల యజమానులపై కఠిన చర్యలు చేపడతాం. హోటాళ్లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, స్వీట్‌ షాపులతో పాటు సూపర్‌ మార్కెట్లలో తరచూ తనిఖీలు నిర్వహిస్తాం. నిబంధనలు అతిక్రమించే వారిపై కేసులు నమోదు చేస్తాం. ప్రజలు ఆహారం తినే ముందు నాసిరకంగా ఉందా, అందులో ఏవైన రసాయనాలు కలిపారా అనేది నిర్ధారించాలని సూచించారు. ఎక్కడైన కల్తీ ఆహార పదార్థాలు విక్రయిస్తే సెల్‌: 7981764779కు సమాచారం అందించాలి. ఈయేడాది ఇప్పటివరకు నాలుగు కేసులు నమోదు చేయడం జరిగింది.

– ప్రత్యూష, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement