కై లాస్‌నగర్: ప్రణాళికల రూపకల్పన, సంక్షేమ పథకాల అమలులో కీలకమైన జనగణన నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. రెండు విడతల్లో ఈ ప్రక్రియ చేపట్టేలా ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతుంది. తొలిసారిగా డిజిటల్ విధానంలో చేపడుతున్న సర్వేకు కసరత్తు ముమ్మరం చేసింది. తొలి విడతలో భాగంగా మే 11 నుంచి జూన్ 9 వరకు ఇళ్ల గుర్తింపు జాబితా సిద్ధం చేయనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రెండో దశలో జనగణన చేపట్టనున్నారు. సర్వే ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బందికి దశలవారీగా శిక్షణ ఇస్తున్నారు. చార్జీ అధికారులైన తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, మ్యాపుల తయారీకి సంబంధించిన టెక్నికల్ అసిస్టెంట్లకు ఇప్పటికే శిక్షణ పూర్తికాగా, ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
800 ఇళ్లకు ఒక ఎన్యూమరేటర్..
జిల్లాలో ఏకై క ఆదిలాబాద్ మున్సిపాలిటీతో పాటు 473 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలోని ఇళ్లను గుర్తించేందు కోసం ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు విధులు నిర్వహించనున్నారు. 800 ఇళ్లకు ఒకరు చొప్పున 1,242 మంది ఎన్యూమరేట్లరను, అలాగే ఆరుగురికి ఒక సూపర్‌వైజర్ చొప్పున 217 మందిని నియమించారు. అదనపు సిబ్బందితో కలిపి 1608 మందిని అందుబాటులో ఉంటారు. వీరికి ఈ నెల 18 నుంచి మే 5వరకు మండలాల వారీగా ఫీల్డ్ ట్రైనర్లు శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం వీరంతా క్షేత్రస్థాయిలో ఇళ్ల జాబితాను, కుటుంబాల సమాచారాన్ని సేకరించి ప్రత్యేక యాప్ హెచ్‌ఎల్‌వోలో నమోదు చేయనున్నారు. కాగా ఈ ప్రక్రియలో కీలకపాత్ర పోషించనున్న చార్జీ ఆఫీసర్‌లైన తహసీల్దార్లకు గత నెల 12, 13, 14 తేదీల్లో మూడు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మ్యాపుల తయారీకి సంబంధించి టెక్నికల్ ఆసిస్టెంట్లకు గత నెల 20 నుంచి మూడు రోజుల పాటు శిక్షణ అందించారు. 28, 29, 30 తేదీల్లో ఫీల్డ్ ట్రైనర్లకు శిక్షణ పూర్తి చేశారు.
మే 11 నుంచి తొలిదశ..
జనగణన తొలిదశలో భాగంగా వచ్చే మే 11నుంచి జూన్ 9వరకు ఎన్యూమరేటర్లు గ్రామాలు, వార్డుల్లో క్షేత్రస్థాయికి వెళ్లనున్నారు. వాటి పరిధిలో ఎన్ని గృహాలు ఉన్నాయో గుర్తించి, ప్రాంతాల వారీగా పటాలను రూపొందించనున్నారు. స్వరాష్ట్రంలో తొలిసారిగా నిర్వహించనున్న జనగణనకు శాటిలైట్ అనుసంధానంతో రూపొందించిన సాంకేతికత వినియోగిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న హెచ్‌ఎల్‌వో యాప్‌లో సమాచారం నిక్షిప్తంచేయనున్నారు. ప్రజలు ఈ యాప్ ద్వారా లాగిన్‌అయి కేంద్రం నిర్దేశించిన 33 అంశాలతో తమ స్వయంగా వివరాలు నమోదు చేసుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. ఈ అంశాలను ఎన్యూమరేటర్లు తిరిగి పరిశీలిస్తారు. 2027 ఫిబ్రవరి నుంచి రెండో దశలో జనగణన సర్వే చేపట్టనున్నారు.
జిల్లాలో
మండలాలు : 21
జనాభా : 7,08,972
గృహాలు : 1,56,683
ఎన్యూమరేటర్లు : 1,242
సూపర్‌వైజర్లు : 217
బల్దియాలో మాక్ సర్వే
వచ్చే మే నెలలో ప్రారంభం కానున్న జనగణన–2027కు సంబంధించి మాక్ సర్వేను మున్సిపల్ అధికారులు పట్టణంలో శుక్రవారం నిర్వహించారు. స్థానిక కేఆర్‌కే కాలనీలో కమిషనర్ జి.రాజు హాజరై స్వయంగా ప్రజల నుంచి వివరాలు సేకరించి ఎన్యూమరేటర్లకు ప్రత్యక్ష అవగాహన కల్పించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా హౌస్ లిస్టింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఆయన వెంట మున్సిపల్ మేనేజర్ స్వామి, వార్డు ఆఫీసర్ నరేష్ తదిరులున్నారు.


