మహిళల భద్రతకు ప్రాధాన్యత
ఆదిలాబాద్‌రూరల్: జిల్లాలో మహిళల భద్రతకు పటిష్ట చర్యలు చేపడుతున్నామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. రూరల్ పోలీస్‌స్టేషన్‌లో మహిళా సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన నూతన గదిని శుక్రవారం ఆయన ప్రారంభించారు. మహిళలు, చిన్నారుల భద్రత కోసం షీటీం ఆధ్వర్యంలో పోలీసు అక్క కార్యక్రమం నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నామన్నారు. సిబ్బంది విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇందులో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్‌రెడ్డి, రూరల్ సీఐ ఫణిదర్, ఎస్సై విష్ణువర్ధన్, ఈశ్వర్, గంగాప్రసాద్, సిబ్బంది ఉన్నారు.
చైల్డ్‌పోర్న్ వీడియోలు చూస్తే కఠిన చర్యలు
ఆదిలాబాద్‌టౌన్: చైల్డ్ పోర్న్ వీడియోలు చూసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రకటనలో తెలిపారు. ఇటీవల కొంతమంది చైల్డ్ పోర్న్ వీడియోలు చూడటం, వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం వంటి చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు చట్టరీత్యా నేరమని, వీటిని ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. బాధ్యులపై పోక్సో కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో ఇప్పటివరకు ఐదు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.


